ట్రాన్స్‌ఫార్మర్‌ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఫార్మర్‌ కష్టాలు

Feb 4 2026 7:19 AM | Updated on Feb 4 2026 7:19 AM

ట్రాన్స్‌ఫార్మర్‌ కష్టాలు

ట్రాన్స్‌ఫార్మర్‌ కష్టాలు

ఓవర్‌లోడ్‌తో మోటార్లు , స్టార్టర్లు ఢమాల్‌!

ఆలస్యమవుతోన్న రీప్లేస్‌మెంట్‌

భారీగా పెరిగిన వినియోగమే కారణం

పలమనేరు : ట్రాన్స్‌కో డివిజన్‌ పరిధిలో రైతులకు ఓవర్‌లోడ్‌ కారణంగా తరుచూ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. దీంతో పాటే స్టార్టర్లు, మోటార్లు దెబ్బతింటున్నాయి. వీటిని రీప్లేస్‌ చేసుకోవడానికి ఇస్తే 15 రోజులకు గానీ రైతులకు చేరడం లేదు. ఫలితంగా పచ్చని పంటలకు నీరందివ్వలేని దుస్థితి నెలకొంది. నెల రోజులుగా ఉన్న ఈ సమస్య ప్రస్తుతం మరింత జఠిలమైంది. పలమనేరు ట్రాన్స్‌కో డివిజన్‌ పరిధిలో పలమనేరు, బైరెడ్డిపల్లి, వి.కోట మండలాలున్నాయి. ఇందులో 20 వేల దాకా విద్యుత్‌ సర్వీసులున్నాయి. గతంలో వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటినప్పుడు ఈ ప్రాంతంలో కేవలం ఆరువేల కనెక్షన్లు మాత్రమే రన్నింగ్‌లో ఉండగా ప్రస్తుతం 18 వేల కనెక్షన్లు రన్‌ అవుతున్నాయి. గతంలో ఇక్కడ కేవలం 5 వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతుండేవి. ఇప్పుడు పంటల సాగు 50 వేల హెక్టార్లకు చేరింది. ముఖ్యంగా ఈ సీజన్‌లో వేసవిలో వరి సాగు ఎక్కువైంది. దీంతో విద్యుత్‌ వినియోగం ఎక్కువైంది.

భారం ఎక్కువ

గతంలో ఒక్కో 15 హెచ్‌పీ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఇద్దరు రైతులకు చెందిన రెండు 7.5 హెచ్‌పీ మోటార్లు నడుస్తుండేవి. భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు 15 హెచ్‌పీ ట్రాన్స్‌ఫార్మర్లను 25 హెచ్‌పీగా అప్‌గ్రేడ్‌ చేయించుకున్నారు దీంతో పాటే మోటార్లు, స్టార్టర్లు సామర్‌ాధ్యన్ని పెంచుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి అలా కాదు. ట్రాన్స్‌ఫార్మర్‌ పరిధిలోని అందరు రైతులు పెంచిన కెపాసిటీతోనే విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. ఈ కారణంగా భారీగా ఓవర్‌లోడ్‌ అవుతోంది. ఈక్రమంలో తరచూ ట్రాన్స్‌ఫార్మర్లు ట్రిప్‌ కావడంతో పాటు మోటార్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయి.

మరమ్మతుల్లో జాప్యం

మరమ్మతుకు గురైన ట్రాన్స్‌ఫార్మర్లను రీప్లేస్‌మెంట్‌ కోసం ఇస్తే కనీసం 15 రోజులులైనా అవి మరమ్మతులు కావడం లేదు. పెద్దసంఖ్యలో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతోండడంతో చాలీచాలని సిబ్బందితో వాటిని మరమ్మతు చేయిస్తుండడంతో ఆలస్యమవుతోంది. ఈ వ్యవధిలో రైతు పండించిన పంటలు ఎండుముఖం పడుతున్నాయి. వీటిని రీప్లేస్‌ చేసుకోవాలన్నా ట్రాన్స్‌కో సిబ్బందికి మామూళ్లు ఇచ్చుకోవాల్సింది వస్తోందని రైతులు వాపోతున్నారు.

కాలిపోతున్న నియంత్రికలు

కెపాసిటర్లే ప్రత్యామ్నాయం

పలమనేరు డివిజన్‌ పరిధిలో ఎక్కువగా హై ఓల్టేజ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఎక్కువగా కాలుతుండడంపై ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు గతంలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ఓవర్‌లోడ్‌ కారణంగానే ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నట్లు తేల్చారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా కెపాసిటర్లను అమర్చుకోవాలని వారు సూచిస్తున్నారు. 7.5 హెచ్‌పీ మోటార్‌కు 3–కేవిఆర్‌ సామర్ధ్యం గల ఐఎస్‌ఐ మార్కు కెపాసిటర్‌ను వాడుకోవాల్సి ఉంది. దీంతో విద్యుత్‌ వినియోగం తగ్గి అటు ట్రాన్స్‌ఫార్మర్‌కు గానీ ఇటు మోటార్‌, స్టార్టర్లకు ఇబ్బంది లేకుండా రైతుకు మేలు జరిగే అవకాశం ఉంది. కాగా ట్రాన్స్‌ఫార్మర్ల విషయంగా ఎవరైనా మామూళ్లు అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని ట్రాన్స్‌కో ఈఈ శ్రీనివాసమూర్తి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement