ఎస్‌టీఐ వ్యాధులపై అవగాహన కల్పించాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఎస్‌టీఐ(సెక్సువలీ ట్రాన్సి ్మటెడ్ ఇన్ఫెక్షన్స్) వ్యాధులపై విస్తృత అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ సుధారాణి ఆదేశించారు. చిత్తూరు నగరంలోని కార్యాలయంలో మంగళవారం ల్యాబ్ టెక్నీషియన్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎస్‌టీఐ వ్యాధులపై అవగాహన కల్పించే గోడపత్రికలను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లైంగిక సంబంధాల ద్వారా వ్యాపించే సిఫిలిస్, గనేరియా, శాంక్రాయిడ్, గోనోకోకల్ వంటి వ్యాధులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. విచ్చలవిడి శృంగారం ద్వారా ఈ వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. అయితే మొదటి దశలోనే గుర్తించి వైద్యులు చికిత్స అందిస్తే వ్యాధులు పూర్తిగా తగ్గుముఖం పడతాయన్నారు. అందుకే ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా క్షేత్రస్థాయి సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్ మాట్లా డుతూ.. క్షేత్రస్థాయి సిబ్బంది నాణ్యమైన నమూనాల (క్వాలిటీ శాంపిల్స్) సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సరైన నమూనాలు పరీక్షించినప్పుడే పాజిటివ్ కేసులు గుర్తించగలమని, ఆ దిశగా పర్యవేక్షణ పెంచాలని సూచించారు. డాక్టర్లు రెఫర్ చేసిన అన్ని రకాల రక్త పరీక్షలను ల్యాబ్‌లో తప్పనిసరిగా నిర్వహించాలని, పాజిటివ్ కేసులు గుర్తించిన వెంటనే వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు.


