
అశ్వ వాహనంపై వరసిద్ధుడి అభయం
కాణిపాకం: కాణిపాక స్వయంభు శ్రీవర సిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. గురువారం సిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామి అశ్వ వాహనంపై ఊరేగుతూ అభయమిచ్చారు. డప్పు వాయిద్యాలు, మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల నడుమ స్వామివారు ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈ సేవకు తిరువణంపల్లె, 44 బొమ్మసముద్రం, చింతమాకులపల్లె, కారకాంపల్లె గ్రామాలకు చెందిన గోనుగుంట, బలిజ వంశీయులు ఉభయదారులు వ్యవహరించారు. తిరుకల్యాణోత్సవం సందర్భంగా భిక్షాండి కార్యక్రమం నిర్వహించారు. కల్యాణానికి పూజాసామగ్రిని సమకూర్చుకోవడా నికి శివపార్వతులు గ్రామంలో భిక్షాటన చేయడం ఆనవాయితీ. అనంతరం ఉభయదేవీరీలతో కూడిన వినాయకుడి తిరుకల్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపించారు. తదనంతరం ప్రారంభమైన అశ్వ వాహన సేవలో మండపం వద్ద ఆనవాయితీ ప్రకారం స్వామి వారు నిలువు దోపిడీకి గురుయ్యారు. స్వామి ఆభరణాలు, నైవేద్యం, అత్తవారు కట్టించిన ఉండ్రాళ్లు, చిల్లర, కాసులను దొంగలు దోపిడీ చేసే ఘట్టాన్ని కన్నుల పండువగా జరిపించారు.
నేడు ఉత్సవాలు ఇలా..
వరసిద్ధి వినాయకస్వామి క్షేత్రంలో శుక్రవారం సాయంత్రం ధ్వజావరోహణం కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఉభయదారుల ఆధ్వర్యంలో అభిషేకం, వడాయత్తు ఉత్సవం, రాత్రి ఏకాంతసేవ జరగనుంది. దీంతో గణణాథుని బ్రహ్మోత్సవాలు పరిపూర్ణం కానున్నాయని, మరుసటి రోజు నుంచి ప్రత్యేక ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఈఓ పేర్కొన్నారు.
టీటీడీ తరఫున పట్టు వస్త్రాల సమర్పణ
బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం వినాయక స్వామికి టీటీడీ తరఫున చైర్మన్ బీఆర్.నాయుడు పట్టువస్త్రాలను సమర్పించారు. ఊరేగింపుగా వచ్చి స్వామికి పట్టువస్త్రాలు అందజేశారు. వారికి ఆలయ ఈఓ పెంచలకిషోర్ స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. టీటీడీ ఈఓను పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు.

అశ్వ వాహనంపై వరసిద్ధుడి అభయం

అశ్వ వాహనంపై వరసిద్ధుడి అభయం

అశ్వ వాహనంపై వరసిద్ధుడి అభయం

అశ్వ వాహనంపై వరసిద్ధుడి అభయం

అశ్వ వాహనంపై వరసిద్ధుడి అభయం