
‘ముందే’ కూసింది!
మూడు నెలల ముందే సర్పంచ్ ఎన్నికలు
చిత్తూరు కార్పొరేషన్: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పంచాయతీరాజ్‌శాఖకు ఎస్‌ఈసీ లేఖలు పంపింది. స్థానిక సంస్థల ఎన్నికల పై రాష్ట్ర ప్రభుత్వం సైతం ముందుస్తుగా వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లు జిల్లా అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేసింది. సర్పంచుల పదవీ కాలం వచ్చే ఏడాది ఏప్రిల్‌తో ముగియనుంది. కానీ మూడు నెలల ముందే ఎన్నికల నిర్వహణకు చట్టంలో ఉన్న వెసులుబాటు మేరకు కసరత్తును ప్రారంభించింది.
సజావుగా సాగేనా?
క్షేత్ర స్థాయిలో రెడ్ బుక్ పేరుతో ఏకగ్రీవం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి పాలనలో ఇటీవల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎలా బెదిరింపులకు పాల్పడ్డారో అందరికీ తెలిసిన విషయమే. దానికితోడు టీడీపీ, జనసేన, బీజేపీలోనూ ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. ఏ పార్టీ మద్దతుదారులకు సర్పంచ్‌గా అవకాశం ఇస్తారో తెలియని పరిస్థితి.
ఎన్నికల షెడ్యూల్
అక్టోబరు 15లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేయాలి. 16 నుంచి నవంబర్ 15వ తేదీలోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసి ప్రచురించాలి. నవంబరు 1–15 లోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తిచేయాలి. 16–30లోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటివి పూర్తిచేయాలి. డిసెంబర్ 15 లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి. డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి, అదే నెలలో ఫలితాలు ప్రకటించాలి.
జిల్లా సమాచారం
పంచాయతీలు 696
వార్డులు 6,220
గ్రామీణ జనాభా 14,63,661 మంది
ఓటర్లు 10,91,739 మంది