వివరాలు దాచేస్తూ.. పరిశీలన పేరుతో సాగదీస్తూ! | - | Sakshi
Sakshi News home page

వివరాలు దాచేస్తూ.. పరిశీలన పేరుతో సాగదీస్తూ!

Aug 27 2025 8:53 AM | Updated on Aug 27 2025 8:53 AM

వివరా

వివరాలు దాచేస్తూ.. పరిశీలన పేరుతో సాగదీస్తూ!

● గందరగోళంగా మామిడి జాబితా ● బయటపడుతున్న కూటమి బాగోతాలు ● అయోమయంలో రైతులు

కాణిపాకం: జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి గందరగోళంగా మారింది. అష్టకష్టాలు పడి ఫ్యాక్టరీలకు తోలిన మామిడికి ఇంకా ప్రోత్సాహక నిధి రాకపోగా.. పరిశీలన పేరుతో అధికారులు కాలయాపన చేయడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 56 వేల హెక్టార్లలో మామిడి సాగు చేయగా.. తోతాపురి రకం 39,895 హెక్టార్లల్లో సాగవుతోంది. తద్వారా 4,9,274 మెట్రిక్‌ టన్నుల కాయలు దిగుబడి అయినట్టు అంచనా. ఈ పంటను విక్రయించడానికి రైతులు ముప్పుతిప్పలు పడ్డారు. ఫాక్టరీల వద్ద పడిగాపులు కాశారు. కూటమి ప్రభుత్వం తోతాపురి కిలోకు రూ.12 మద్దతు ధర ప్రకటించింది. ఇందులో ఫ్యాక్టరీలు రూ.8, ప్రభుత్వ ప్రోత్సాహక నిధిగా రూ.4 నిర్ణయించింది. ఈ ప్రభుత్వ ప్రోత్సాహక నిధిని దోచుకోవడానికి కూటమి నేతలు అడ్డదారులు తొక్కడం కనిపించింది.

ఫ్యాక్టరీ లెక్కల్లో డబుల్‌ ఎంట్రీలు

జిల్లాలో 43 మ్యాంగో ఫ్యాక్టరీలున్నాయి. వీటిల్లో 31 ఫ్యాక్టరీలు తోతాపురి కాయల కొనుగోలుకు ముందుకొచ్చాయి. గత జూలై మూడో వారం వరకు కాయలు కొనుగోలు చేశాయి. అప్పటి వరకు 49,530 మంది రైతులు 2.31 లక్షల మెట్రిక్‌ టన్నుల కాయలను తరలించారు. ఈ లెక్కలు తారుమారు కావడంతో పాటు బోగస్‌లున్నాయని కూటమికి చెందిన ఎమ్మెల్యేలే సభలు, సమావేశాల్లో ప్రస్తావించారు. దీనికితోడు సాక్షి దినపత్రికలో సైతం తమిళనాడు కాయలను తీసుకొచ్చి ప్రోత్సాహక నిధి కోసం ఫ్యాక్టరీలకు అమ్ముకున్నారని కథనాలొచ్చాయి. దీనిపై అధికారులు సైతం స్పందించారు. ఆ జాబితాను పరిశీలనకు పెట్టారు. గత రెండు నెలలుగా ఈ పరిశీలన సాగుతోంది. రెండు రోజుల క్రితమే ఫ్యాక్టరీలకు కాయలు తరలించిన రైతుల వివరాలను వెల్లడించారు. ఇందులో డబుల్‌ ఎంట్రీలు ఉన్నట్టు గుర్తించారు. పంట లేకుండా కాయలు విక్రయించిన రైతు వివరాలను కూడా గుర్తించినట్లు సమాచారం. ర్యాంపు జాబితా పూర్తయినా వెంటనే అధికారులు ఈ గోల్‌మాల్‌ను బయటపెట్టనున్నారు.

ర్యాంపు జాబితా గందరగోళం

జూలై నెలాఖరు వరకు ర్యాంపుల ద్వారా తోతాపురి కొనుగోలు సాగింది. 30,600 మంది రైతులు 1.44 లక్ష మెట్రిక్‌ టన్నుల కాయలను ర్యాంపులకు విక్రయించారు. ఈ కొనుగోలు లెక్కలు గందరగోళంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది కూటమి నేతలు తోతాపురి కాయలను ర్యాంపులకు తీసుకెళ్లి వేబిల్లు వేసుకుని కాయలు దింపకుండా.. సిబ్బంది చేతికి వేబిల్లు, ఆధార్‌, పాసు పుస్తకం మాత్రమే ఇచ్చారు. మళ్లీ మరో ర్యాంపుకెళ్లి ఇదేమాదిరిగానే కాయలు తోలినట్లు పత్రాలు ఇవ్వడం.. తప్పుడు లెక్కల్లోకి ఎక్కించారు. ఇదంతా పలమనేరు, వీ.కోట, బంగారుపాళ్యం వంటి ప్రాంతాల్లో అధికంగా చోటుచేసుకుంది. అలాగే నీలం రకాన్ని కూడా తోతాపురి లెక్కల్లోకి కలిపేశారు. రెండు రోజుల నుంచి ఈ జాబితా లెక్కలను పరిశీలిస్తున్నారు.

రూ.8 మాట ఏమైంది?

మామిడిలోని తోతాపురి రకానికి ఫ్యాక్టరీలు కేజీకి రూ.8 ఇవ్వాలని కూటమి ప్రభుత్వం సూచించింది. ఇవ్వని ఫ్యాక్టరీలను సీజ్‌ చేస్తామని హెచ్చరికలు జారీచేసింది. అయితే ఇప్పుడు ఫ్యాక్టరీలు తోతాపురికి రూ.5 చొప్పున చెల్లిస్తున్నాయి. దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు లేరు.

మద్దతు ధర ఇవ్వాలి

ఫ్యాక్టరీకి 40 టన్నుల తోతాపురి కాయలు తరలించాను. దీనికి ఫ్యాక్టరీ 38 టన్నులకు కిలో రూ.4.9 పైసలు చొప్పున నగదును బ్యాంగు ఖాతాలో జయచేసింది. 12 టన్నుల కాయలకు బిల్లు రావాల్సి ఉంది. వచ్చే ఏడాదికి పెట్టుబడి పెట్టే పరిస్థితి కూడా లేదు.

– కుప్పారెడ్డి, మామిడి రైతు,

కార్వేటినగరం మండలం

కిలో రూ.5నా?

మామిడి సీజన్‌ ఆరంభంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోతాపురి కేజీకి రూ.12 చొప్పున మద్దతు ధర ప్రకటించారు. ఇందులో ఫ్యాక్టరీలు కిలోకు రూ.8, ప్రభుత్వం ప్రోత్సాహక నిధికింద రూ.4 చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించారు. కానీ ఇది ఎక్కడా అమలు కావడం లేదు. పలు ఫ్యాక్టరీలు రూ.5 మాత్రమే ఇస్తున్నాయి.

–హరిబాబునాయుడు, జిల్లా మామిడి రైతు నాయకుడు, చిత్తూరు మండలం

వివరాలు దాచేస్తూ.. పరిశీలన పేరుతో సాగదీస్తూ! 1
1/2

వివరాలు దాచేస్తూ.. పరిశీలన పేరుతో సాగదీస్తూ!

వివరాలు దాచేస్తూ.. పరిశీలన పేరుతో సాగదీస్తూ! 2
2/2

వివరాలు దాచేస్తూ.. పరిశీలన పేరుతో సాగదీస్తూ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement