
వివాహానికి వెళ్లి వస్తూ!
బంగారుపాళెం: వివాహానికి వెళ్లి వస్తూ మొగిలి ఘాట్ దొరచెరువు వద్ద బెంగళూరు–చైన్నె జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. సీఐ శ్రీనివాసులు కథనం.. తమిళనాడులోని వేలూరుకు చెందిన సుల్తాన్‌బాషా కుటుంబ సభ్యులు కారు(టవేరా వాహనం, టీఎన్02వై2975)లో బెంగళూరులో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడి నుంచి మంగళవారం వేకుమజామున 2.30 గంటలకు వేలూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో బంగారుపాళెం మొగిలి ఘాట్ దొరచెరువు స్పీడ్‌బ్రేకర్ల వద్ద ఉదయం 5.30 గంటల సమయంలో ముందువెళ్తున్న ఐచర్ వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వేలూరు జిల్లా, సోలవరం తాలూకా, పాళెంపాకంకు చెందిన ఫొటోగ్రాఫర్ వినోద్‌కుమార్(45) మృతి చెందాడు. సుల్తాన్‌బాషా, అతని భార్య షబానాభాను, డ్రైవర్ బాలమురళీకృష్ణతో పాటు మరో ఐదుగురు గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన వారిని హైవే మొబైల్ వాహనంలో పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అందులో నలుగురిని వేలూరు సీఎంసీకి రెఫర్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారు అతివేగంగా వెళ్లి ముందువెళ్తున్న ఐచర్‌ను ఢీకొనడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

వివాహానికి వెళ్లి వస్తూ!