
తిరుమల ఘాట్‌లో తప్పిన ప్రమాదం
తిరుమల : ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు ముందు చక్రం బేరింగ్ రాడ్డు విరిగిపోవడంతో డ్రైవర్ చాకచక్యంగా బస్సును ఆపడంతో భక్తులు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. తిరుమల ట్రాఫిక్ సీఐ హరిప్రసాద్ తెలిపిన వివరాల మేరకు తిరుమల నుంచి తిరుపతికి ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ బస్సు 25 మంది ప్రయాణికులను ఎక్కించుకుని బయలుదేరింది. బస్సు 57 మలుపు వద్దకు చేరుకోగా ఆకస్మాత్తుగా బస్సు ముందరి టైరు బేరింగ్ రాడ్ విరిగిపోయింది. దీంతో బస్సు ఒక్కసారిగా రోడ్డుకు రాసుకుంటూ కొంతదూరం వెళ్లి ఆగిపోయింది. బస్సు వేగం తక్కువగా ఉండడంతో బస్సు డ్రైవర్ చాకచక్యంగా బస్సును ఆపివేయడంతో ప్రయాణికులు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వెంటనే సమాచారం అందుకున్న ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బస్సును పక్కకు తొలగించారు. బస్సులోని ప్రయాణికులను మరో ఆర్టీసీ బస్సులో తిరుపతికి తరలించారు.
ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు
తమిళనాడు చైన్నెకు చెందిన భక్తులు శ్రీవారి దర్శనార్థం కారులో తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం కారులో మొదటి ఘాట్ రోడ్డు మీదుగా కిందకు దిగుతుండగా 34 మలుపు వద్ద కారు అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొని ముందు వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నాడు. అయితే కారులోని ఎయిర్ బెలూన్‌న్స్ ఓపెన్ కావడం, కారువేగం తక్కువగా ఉండడంతో భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని కారును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కారు డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడంతోనే ప్రమాదం చోటుచేసుకున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.