
మామిడి బకాయిలు చెల్లించండి
పుత్తూరు: మామిడి రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలని మామిడి రైతు సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి హేమలత డిమాండ్ చేశారు. గురువారం స్థానిక మార్కెట్ యార్డులో రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన విధంగా మామిడి ఫ్యాక్టరీ యాజమాన్యాలు కేజీకి రూ.8, ప్రభుత్వం రూ.4తో కలిపి మొత్తం రూ.12 వంతున చెల్లించాలన్నారు. రోజులు గడిచిపోతున్నా ఫ్యాక్టరీ యాజమాన్యాలుగానీ, ప్రభుత్వం గానీ నగదు చెల్లించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నాయని ఆరోపించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఐక్యంగా ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘ నాయకులు హరిబాబు, ఆనందనాయుడు, యువరాజ్ పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి
పుత్తూరు: తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ వర్కర్లు గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అక్కడి నుంచి నగరం రోడ్డు కూడలి వరకు ప్రదర్శనగా వెళ్లి మానవహారం చేపట్టారు. యూనియన్ నాయకురాలు మునికుమారి మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా అంగన్‌వాడీ వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.