
విద్యాశాఖకు రెండు బహుమతులు
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్రస్థాయిలో ఈ నెల 19న నిర్వహించిన వికసిత్ భారత్ సెమినార్‌లో చిత్తూరు జిల్లా విద్యాశాఖకు రెండు బహుమతులు లభించాయి. ఈ సెమినార్‌కు జిల్లా తరఫున డీఈఓ వరలక్ష్మి, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణ హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖ తరఫున టీమ్‌గా ఏర్పడి ఇతర అధికారుల సమన్వయంతో డీఈఓ వరలక్ష్మి ఎఫ్‌ఎల్‌ఎన్ (ఫంక్షనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) అనే అంశంపై సెమినార్ ఇచ్చారు. అలాగే జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ మద్దిపట్ల వెంకటరమణ స్కూలింగ్.. బిల్డింగ్ బ్లాక్స్ అనే అంశంపై టీమ్‌గా ఏర్పడి సెమినార్ ఇచ్చారు. ఈ సెమినార్ టీమ్‌లలో పలు జిల్లాలకు చెందిన డీలో, ఏపీసీలు సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర సమగ్రశిక్ష శాఖ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వరరావు అధ్యక్షతన సెమినార్ నిర్వహించి నిర్ధేశించిన 10 థీమ్‌లపై చర్చించారు. ఈ సెమినార్‌లో జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ పాల్గొన్న సెమినార్‌లో ‘బాల్యం బాగుంటే భవిష్యత్ బాగుంటుంది’ అనే చర్చలో మొదటి బహుమతి సాధించారు. అలాగే ఎఫ్‌ఎల్‌ఎన్ టీమ్‌కు రెండో బహుమతి లభించింది. ఈ సెమినార్‌లో రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, సమగ్రశిక్ష శాఖ ఎస్పీడీ శ్రీనివాసరావు చేతుల మీదుగా డీఈఓ, ఏపీసీలు బహుమతులు స్వీకరించారు.