
సంవత్సరమంతా భూమిని కప్పి ఉంచండి
పెనుమూరు(కార్వేటినగరం): ప్రకృతి వ్యవసాయం విధానంలో భాగంగా సంవత్సరమంతా భూమిని కప్పి ఉంచాలని ఆర్ వైఎస్‌ఎస్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ వాసు సూచించారు. బుధవారం కేసీ పల్లి, తిరివిరెడ్డిపల్లి, చార్వాకానిపల్లి పంచాయతీల్లో ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమిని కప్పి ఉంచడంతో భూసారం పెరగడమే కాకుండా భవిష్యత్తులో మంచి దిగుబడులు సాధించవచ్చన్నారు. బహుళ పంటలు సాగు చేయడంతో ఒక పంట పోయినా మరో పంట ద్వారా ఆదాయం పొందవచ్చని తెలిపారు. వర్షాలు బాగా కురవడంతో వేరుశనగలో అంతర పంటలు సాగు చేయాలని సూచించారు. అలాగే సెప్టెంబర్‌లో రాష్ట్రస్థాయి అధికారులు క్షేత్ర పరిశీలన చేయనున్నారని, ఈ లోపు సిబ్బంది రైతులు ఏ గ్రేడ్, ఏటీఎం, పీఎండీఎస్, బహుళ పంటలు, ఆర్డీస్ పంటలు సాగు చేయాలని పేర్కొన్నారు. అనంతరం వరిలో అంతర పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది హనుమంతు, నవీన్, హరికృష్ణారెడ్డి, వెంకటేష్, అనిల్‌కుమారి, గౌతమి, మణెమ్మ, హేమలత, భాస్కర్, రామానాయుడు పాల్గొన్నారు.