చిత్తూరు కార్పొరేషన్: నగరంలోని అర్బన్ డివిజన్ ట్రాన్స్‌కో కార్యాలయం ఆవరణలో బుధవారం విద్యుత్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన వినియోగదారులు వినతులు అందజేశారు. వాటిని సకాలంలో పరిష్కారించాలని డీఈ ప్రసాద్ ఆ దేశించారు. వ్యవసాయ సర్వీసులకు డబ్బులు కట్టి వేచి చూస్తున్నమని వెంటనే సర్వీసు ఇ వ్వాలని రెడ్డిగుంట, కొత్తపల్లె సెక్షన్ పరిధిలోని రైతులు ఫిర్యాదు చేశారు. కొత్తపల్లెలో నీటి సరఫరా కోసం మీటరు ఇవ్వాలని వినియోగదారుడు వినతిపత్రం సమర్పించారు. భూతగాదాలో ఉన్న సర్వీసు మీటర్ మార్చవద్దని చిత్తూరు రూరల్ పరిధిలోని ఓ వినియోగదారుడు తెలియజేశారు. సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని డీఈ వివరించారు. టెక్నికల్ ఏఈ మాధురి పాల్గొన్నారు.
ఎల్‌ఈడీ టీవీల సమర్పణ
కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి బుధవారం ఓ దాత ఎల్‌ఈడీటీవీలను విరాళంగా సమర్పించారు. చిత్తూరు నగరానికి చెందిన విమ్సన్ అధినేతలు రవీంద్రనాథ్, రమణ రూ.1.20 లక్షలు విలువ చేసే 55 ఇంచెస్ రెండు టీవీలను ఈఓ పెంచలకిషోర్‌కు అందజేశారు. అనంతరం ఆయన వారికి ప్రత్యేక దర్శనం కల్పించారు.
రైలు ఢీకొని టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి
పుత్తూరు: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం రాత్రి రైలు ఢీకొని ఎం.శ్రావణ్‌కుమార్(31) అనే యువకుడు మృతి చెందాడు. స్థానిక లక్ష్మీనగ ర్ కాలనీలో నివాసమున్న శ్రావణ్‌కుమార్ నాగలాపురంలోని వేదనారాయణస్వామి ఆలయంలో నాదస్వర విద్వాన్‌గా కాంట్రాక్ట్ బేసిక్‌పై పనిచేస్తున్నాడు. బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి
చిత్తూరు కలెక్టరేట్ : రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని వీఆర్‌ఏల అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు కోదండన్ డిమాండ్ చేశారు. ఆ అసోసియేషన్ నాయకులు బుధవారం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ అసోసియేషన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ వీఆర్‌ఏలకు సకాలంలో ఉద్యోగోన్నతులు కల్పించాలన్నారు. వీఆర్‌ఏల పై ఉండే శాఖాపరమైన చర్యలు త్వరతిగితిన విచారించి పరిష్కరించాలన్నారు. ఆ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు ఇర్ఫాన్ అలీ, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరాజ్, నాయకులు పెరుమాల్, రూపాణి, ఉదయ్, నరేష్ పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా ప్రదోషకాల పూజ
కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైనా మణికంఠేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ప్రదోషకాల పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూలవిరాట్, నందీశ్వరుడికి ఏకకాలంలో ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. స్వామివారికి విశేషాలంకరణ చేసి, భక్తులకు దర్శనం కల్పించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.

వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి