
చిత్తూరులో గీత సామాజిక వర్గానికి మద్యం బార్
చిత్తూరు అర్బన్: కార్పొరేషన్ పరిధిలో ఓ మద్యం బారును కల్లు గీత సామాజిక వర్గానికి కేటాయిస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రూ.5.10 లక్షల ఆన్ రీఫండబుల్ దరఖాస్తు రుసుము చెల్లించి మద్యం బారు కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీసీ ఈడిగ సామాజిక వర్గం కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలని.. లైసెన్స్ ఫీజును 50 శాతం రాయితీతో రూ.27.50 లక్షలుగా నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 29వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 30వ తేదీన ఉదయం 10 గంటలకు చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో దుకాణం కేటాయిస్తామని పేర్కొన్నారు.
పింఛన్ల తొలగింపు దుర్మార్గం
ఐరాల : దివ్యాంగుల పింఛన్లు తొలగించడం దుర్మార్గమని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్ రద్దు నోటీసు అందుకున్న 50 మంది బాధితులు బుధవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఎంపీడీఓ ధనలక్ష్మికి నోటీసులు చూపించి తామ ఏం పాపం చేశామని వాపోయారు. అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాతే సదరం సర్టిఫికెట్ జారీ చేశారని వెల్లడించారు. దాదాపు 15 ఏళ్లుగా పింఛన్ పొందుతున్న తమకు ఇప్పుడు తొలగిస్తూ నోటీసు జారీ చేయడం దారుణమని మండిపడ్డారు. పింఛన్‌ల సంఖ్య తగ్గించేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎంపీడీఓ స్పందిస్తూ.. పింఛన్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హులందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.