
దోమల నియంత్రణతో వ్యాధుల కట్టడి
చిత్తూరు అర్బన్: దోమలను నియంత్రణతోపాటు అవి కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో వ్యాధులను కట్టడి చేయవచ్చని జిల్లా ఇన్‌చార్జ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్ అన్నారు. ఇందుకోసం ప్రతీ ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రపంచ దోమల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం చిత్తూరు నగరంలోని వెంగళరావు కాలనీలో కార్పొరేషన్ అధికారులతో కలిసి అవగాహన ర్యాలీ, దోమల నియంత్రణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదకర విష జ్వరాలు చాలా వరకు దోమ కాటుతోనే వస్తాయన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, నిల్వ నీరు లేకుండా చూడడంతో దోమలను నియంత్రించవచ్చన్నారు. దోమల నియంత్రణకు నగరపాలక సంస్థ పరిధిలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కార్పొరేషన్ ఇన్‌చార్జ్ కమిషనర్ వెంకటరామిరెడ్డి చెప్పారు. ప్రజారోగ్యశాఖ అధికారి డాక్టర్ లోకేష్ మాట్లాడుతూ నగరపాలక పరిధిలో దోమల నియంత్రణకు ఫాగింగ్, మొలాథియన్ పిచికారీ, నిల్వ నీటిలో ఆయిల్ బాల్స్ వేయడం తదితర చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం మేజర్ కాలువలో ఆయిల్ బాల్స్ వేసి, మందు పిచికారీ చేయించారు. దోమల నియంత్రణపై కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎంఓ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.