
గుడిని కూల్చి.. ఆక్రమణకు యత్నం
● నకిలీ పత్రాలతో కూటమి నేతల కుట్ర ● ఆలయ భూమి కాపాడాలని కమిటీ సభ్యుల డిమాండ్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): మురంకబట్టులోని శ్రీసుందర వెంకటేశ్వరస్వామి గుడిని కూటమి నేతలు కూల్చేసి స్థలం ఆక్రమణకు యత్నిస్తున్నారని ఆలయ కమిటీసభ్యులు కార్తీకేయన్, సహదేవన్, ఎల్‌ఐసీ గోపి ఆరోపించారు. బుధవారం చిత్తూరు నగరంలోని మురకంబట్టులో ఈ మేరకు నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆలయాన్ని ఆనుకుని 90 సెంట్ల ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఆన్‌లైన్‌లో డ్రై ల్యాండ్‌గా చూపుతున్న ఈ భూమి ఆక్రమణకు గురువుతోందని తెలిపారు. ప్రజాపరిష్కారవేదికలో ఫిర్యాదు చేస్తే డ్రై ల్యాండ్ చూపిస్తూ అధికారులు బోర్డు పెట్టారన్నారు. ఇటీవల కూటమికి చెందిన పుండరీకాక్షయ్య, ఆనందయ్య, చిన్ని, రాజు తదితరులు జేసీబీలతో ఆలయాన్ని కూల్చేశారని మండిపడ్డారు. నకిలీ పత్రాలు చూపిస్తూ ఈప్రభుత్వ భూమి తమదేనంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాదారుల నుంచి ఆలయ భూమిని విడిపించాలని కోరారు. కార్యక్రమంలో లోకేష్, గౌతమ్, శివ, విజయ్, ఇమాయరాజు, ప్రకాష్, హరి, అశోక్, కోటి, మురాజ్, శంకర్, కుప్పుస్వామి పాల్గొన్నారు.