
మాజీ సైనికుల సంక్షేమానికి లీగల్ ఎయిడ్ క్లినిక్
చిత్తూరు కలెక్టరేట్ : మాజీ సైనికుల సంక్షేమానికి లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ భారతి అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లోని జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాలతో లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. దేశం కోసం పోరాడి ఉద్యోగ విరమణ పొందిన మాజీ సైనికుల సంక్షేమానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలోని మాజీ సైనికులు, కుటుంబ సభ్యులకు ఎలాంటి న్యాయ సలహాలు కావాలన్నా ఇక్కడ సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో పారా మిలిటరీ లీగల్ ఎయిడ్ అడ్వైజర్ నాగరాజరెడ్డి, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రజిని, మాజీ సైనికులు పాల్గొన్నారు.