షార్ట్‌ సర్క్యూట్‌తో ఎలక్ట్రానిక్‌ పరికరాలు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌తో ఎలక్ట్రానిక్‌ పరికరాలు దగ్ధం

Aug 20 2025 5:18 AM | Updated on Aug 20 2025 5:18 AM

షార్ట్‌ సర్క్యూట్‌తో  ఎలక్ట్రానిక్‌ పరికరాలు దగ్ధం

షార్ట్‌ సర్క్యూట్‌తో ఎలక్ట్రానిక్‌ పరికరాలు దగ్ధం

పూతలపట్టు(యాదమరి): విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఓ ఫొటో స్టూడియోలోని ఎలక్ట్రానిక్‌ పరికరాలు దగ్ధమైన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. భాదితుని కథనం.. మండల కేంద్రంలోని పంచాయతీ దుకాణ సముదాయంలో ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం స్టూడియో యజమాని తన సిబ్బందితో కలిసి కాణిపాకంలోని ఓ వివాహ వేడుకకు వెళ్లారు. పనులు ముగించుకుని స్టూడియోకి వచ్చిన సిబ్బందికి లోపల నుంచి పొగ రావడంతో వెంటనే యజమానికి సమాచారం అందించారు. అప్పటికే పలు విలువైన ఎలక్ట్రానిక్‌ పరికరాలు దగ్ధమైనట్లు గుర్తించారు. ఈ ఘటనపై చిత్తూరు ఫొటో, వీడియో గ్రాఫర్స్‌ అసోసియేషన్‌ విచారం వ్యక్థం చేసింది.

అక్రమ స్కానింగ్‌ పై విచారణ

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): అక్రమ స్కానింగ్‌ బాగోతంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు లోతుగా విచారణకు దిగారు. ఈ నెల 10న సాక్షి దినపత్రికలో అక్రమ స్కానింగ్‌ అంతేనా? శీర్షికన వార్త వెలువడింది. దీనిపై స్పందించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. తిరుపతి, చిత్తూరులో అక్రమ స్కానింగ్‌ చేస్తూ పట్టుబడ్డ వారి వివరాలను ఆరా తీస్తున్నారు. ఈ రెండు కేసులలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేసే అధికారులు, సిబ్బంది హస్తం ఉందా..? అనే కోణంలో విచారణ జరుగుతోంది. అలాగే పట్టుబడ్డ స్కానింగ్‌ మిషన్లు... వాటిని అక్రమార్కులు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనే వివరాల కోసం పట్టుబడుతున్నారు. ఈ విచారణ పూర్తయినా తర్వాత డీఎంఅండ్‌హెచ్‌ఓకు నివేదికలు సమర్పించనున్నారు. ఈ మేరకు అక్రమ స్కానింగ్‌కు సహకరించిన అధికారులు, సిబ్బందిపై వేటు పడే అవకాశాలున్నాయి. కాగా అక్రమ బాగోత కేసు వివరాలపై చిత్తూరు వన్‌ టౌన్‌ పోలీసులకు రాతపూర్వకంగా వివరాలు కోరనున్నామని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో

35 మందికి జరిమానా

చిత్తూరు అర్బన్‌: మద్యం తాగి వాహనాలు నడిపిన 35 మందికి రూ.3.5 లక్షల జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఉమాదేవి మంగళవారం తీర్పునిచ్చారు. చిత్తూరు ట్రాఫిక్‌ సీఐ లక్ష్మీనారాయణ గత రెండు రోజులుగా వాహనాలు తనిఖీ చేస్తుండగా పలువురు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. మొత్తం 35 మందిపై కేసు నమోదు చేసి, కోర్టుకు తరలించారు. ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున రూ.3.5 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు?

చిత్తూరు కలెక్టరేట్‌ : ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పెండింగ్‌ బకాయిలు ఇంకెప్పుడు చెల్లిస్తారని వైఎస్సార్‌టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ట్రెజరర్‌ రెడ్డిఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదికి పైగా అవుతోందన్నారు. అయితే ఇప్పటి వరకు ఉద్యోగ, పెన్షనర్‌, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిల విషయం ఏ మాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పెండింగ్‌ బకాయిలు చెల్లించడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లను పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement