దివ్యాంగులంటే అలుసెందుకు? | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులంటే అలుసెందుకు?

Aug 19 2025 5:22 AM | Updated on Aug 19 2025 5:22 AM

దివ్య

దివ్యాంగులంటే అలుసెందుకు?

● పరిశీలన పేరుతో జిల్లాలో 4,732 దివ్యాంగ పింఛన్లు కోత ● మేమంతా నిజమైన దివ్యాంగులమేనంటూ ఆందోళన ● సోమవారం కలెక్టరేట్‌ ఎదుటబైఠాయించిన దివ్యాంగులు

● పరిశీలన పేరుతో జిల్లాలో 4,732 దివ్యాంగ పింఛన్లు కోత ● మేమంతా నిజమైన దివ్యాంగులమేనంటూ ఆందోళన ● సోమవారం కలెక్టరేట్‌ ఎదుటబైఠాయించిన దివ్యాంగులు

చిత్తూరు కలెక్టరేట్‌ : తామంటే అలుసెందుకంటూ దివ్యాంగులు కలెక్టరేట్‌ ఎదుట కదం తొక్కారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క నూతన పింఛన్‌ ఇవ్వకపోగా...ఉన్న పింఛన్లలో కోతలు విధిస్తోంది. ప్రతి సోమవారం చిత్తూరు కలెక్టరేట్‌కు వందల సంఖ్యలో నూతన పింఛన్ల మంజూరు కోసం అర్జీలు ఇస్తున్నారు. ఆ అర్జీలను అధికారులు బుట్టదాఖలు చేస్తున్నారే తప్ప న్యాయం చేయడం లేదు. అసలే వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులపై కూడా కూటమి సర్కారు కన్నెర్ర చేసింది. తాజాగా ఆగస్టు నెలలో చిత్తూరు జిల్లాలోని 4,732 దివ్యాంగ పింఛన్లను తొలగించింది. దీంతో పింఛన్‌ తొలగించిన దివ్యాంగ లబ్ధిదారులు వందలాది మంది చిత్తూరు కలెక్టరేట్‌కు విచ్చేశారు. తమ సదరం సర్టిఫికెట్లను చేతపట్టుకుని కలెక్టరేట్‌లోని ప్రజాసమస్యల పరిష్కార వేదిక భవనం ముందు బైఠాయించి, తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేశారు.

దివ్యాంగులని అనిపించడం లేదా?

చూడగానే వైకల్యం కనిపిస్తున్నా దివ్యాంగులు...నిజమైన దివ్యాంగులనిపించడం లేదా అని దివ్యాంగుల ఐక్యకార్యచరణ సమితి (జేఏసీ) రాష్ట్ర అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రీ అసెస్‌మెంట్‌ పేరుతో దివ్యాంగ పింఛన్ల ఏరివేతకు ప్రాధాన్యమిచ్చిందని మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా దివ్యాంగ పింఛన్లు పొందుతున్న వేలాది మంది అనర్హులంటూ పింఛన్లు తొలగించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. గతంలో వైద్యుల బృందం నిర్ధారించి సర్టిఫికెట్లు అందజేసి పింఛన్లు పొందుతున్న దివ్యాంగులకు తాజాగా నోటీసులు జారీ చేసి పింఛన్‌ తొలగించడం దారుణమన్నారు.

న్యాయం చేయకపోతే ఆందోళనలు ఉధృతం

తొలగించిన పింఛన్లను తిరిగి కొనసాగించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని దివ్యాంగుల ఐక్య కార్యచరణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురళి హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగులపై వ్యవహరిస్తున్న అలసత్వ ధోరణి అన్యాయమన్నారు. దివ్యాంగులపై చిన్నచూపు చూస్తే దారుణమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పింఛన్లపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వేలాది మంది దివ్యాంగులు పొట్టకొట్టడం సబబు కాదన్నారు. అనంతరం కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ దివ్యాంగుల ధర్నా వద్దకు విచ్చేసి వారి సమస్యలను అరగంట సేపు ఓపికగా విని, పరిశీలించారు. పింఛన్లు కోల్పోయిన వందలాది మంది దివ్యాంగులు కన్నీటితో కలెక్టర్‌కు తమ సమస్యలను విన్నవించుకున్నారు. గతంలో వారికి అందజేసిన సర్టిఫికెట్‌లను కలెక్టర్‌ స్వయంగా పరిశీలన చేశారు. తప్పనిసరిగా పునఃపరిశీలన చేసి న్యాయం చేస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.

దివ్యాంగులంటే అలుసెందుకు? 1
1/1

దివ్యాంగులంటే అలుసెందుకు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement