
వింత పోకడలతో కూటమి పాలన
చిత్తూరు కార్పొరేషన్: వింత పోకడలతో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని వైఎస్సార్‌సీపీ నా యకులు తెలిపారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి, మాట్లాడారు. సోమవారం అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి వినతి పత్రం అందజేశారు. విద్యార్థి విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కల్యాణ్‌భరత్ మీడియాతో మాట్లాడారు. హాస్టళ్లు, పాఠశాలలు, కళాశాలల్లో పిల్లల తల్లిదండ్రులు, ఎస్‌ఎంసీ సభ్యులు తప్ప ఇతరులు వెళ్లకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సరికాదన్నారు. నెలరోజులుగా విద్యార్థుల సమస్యలపై వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు హాస్టళ్లు, పాఠశాల, కళాశాలలను సందర్శిస్తున్నారన్నారు. అది గిట్టని సర్కారు ఇటువంటి ప్రొసిడింగ్స్ ఇచ్చిందని గుర్తు చేశారు. మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నరేష్‌లు మాట్లాడారు. విద్యార్థులకు ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన బ్యాగుల నందు నాణ్యత లేదని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు జిల్లా విద్యార్థి జేఏసీ ఛైర్మన్ సద్దాం, స్టాండ్లీ, సిరాజ్, కరీమ్, జస్టిన్, రవి, మహేష్, వెంకటేష్, గోకుల్ తదితరులు పాల్గొన్నారు.