
అయ్యా దండం పెడుతున్నాం.. సమస్యలు పరిష్కరించండి
● సమస్యలు పరిష్కరించాలని అర్జీదారుల మొర ● వివిధ సమస్యలపై 324 అర్జీలు నమోదు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ
చిత్తూరు కలెక్టరేట్ : అయ్యా దండం పెట్టి మొరపెట్టుకుంటున్నాం.. తమ సమస్యలను పరిష్కరించండని అర్జీదారులు ఉన్నతాధికారుల ఎదుట కన్నీరు మున్నీరయ్యారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారులకు అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడేల్, డీఆర్వో మోహన్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాసులు, ఏఓ వాసుదేవన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించి 324 అర్జీలు నమోదయ్యాయి.
ఇంటి పట్టా ఇప్పించడయ్యా
చాలా ఏళ్లుగా సొంత ఇళ్లు లేక అద్దె ఇళ్లలో ఉంటున్నామని, ఇళ్ల పట్టాలు ఇప్పించాలని గుడిపాల మండలంలోని మండికృష్ణాపురం, మాదిగపల్లి, పెరుమాళ్లకుప్పం గ్రామాలకు చెందిన ప్రజలు కోరారు. ఆయా గ్రామస్తులు ధనంజయ, రాజేంద్ర మాట్లాడుతూ ఎస్సీలైన తమకు సొంత ఇళ్లు లేక అవస్థలు ఎదుర్కొంటున్నామని, తమ గ్రామంలో సర్వే నంబర్ 141లో 36 సెంట్లు ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఆ భూమిని పరిశీలించి ఇళ్లు లేని తమకు కేటాయించాలని కోరారు.
వితంతు పింఛన్ ఇప్పించడయ్యా
తనకు వితంతు పింఛన్ ఇప్పించడయ్యా అని గంగవరం మండలం పత్తికొండగ్రామానికి చెందిన నాగమ్మ వాపోయారు. ఆమె మాట్లాడుతూ తనకు ఎలాంటి జీవనాధారం లేదన్నారు. వితంతు పింఛన్ కోసం సచివాలయం, మండల కార్యాలయం చుట్టూ తిరిగినా లాభం లేదన్నారు. దయతో వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరారు.
గ్రానైట్ బండగా చూపిస్తున్నారు
ఎన్నో ఏళ్లుగా తమ గ్రామానికి సమీపంలో ఉన్న ఎద్దులబండపై తాము పండించుకునే పంటలను ఆరబెట్టుకుంటున్నామని, అయితే ప్రస్తుతం ఆ బండను గ్రానైట్ బండగా చూపిస్తున్నారని వెదురుకుప్పం మండలం కొమ్మరగుంట వాసులు వాపోయారు. ఆ గ్రామస్తులు నారాయణరెడ్డి, శాంతమ్మ మాట్లాడుతూ చాలా ఏళ్లుగా తమ గ్రామంలోని రైతులు సమీపంలో ఎద్దులబండపై తమ గ్రామంలో పండించే రాగులు, వరి, వేరుశనగ ఉత్పత్తులను ఆరబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ బండను గ్రానైట్ బండగా చూపించి కూల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. న్యాయం చేయాలని కోరారు.
దారి సమస్య పరిష్కరించాలి
దారి సమస్య పరిష్కరించాలని బంగారుపాళెం మండలం మహాసముద్రం గ్రామానికి చెందిన కేశవయ్య కోరారు. ఆ గ్రామస్తులు పీజీఆర్‌ఎస్‌లో అర్జీ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన రాజమ్మ గ్రామ ఖాతా నంబర్ 119/4 ఏ లో తన పేరుపై 35 సెంట్లు, ఖాతా నంబర్ 118/ఏ లో 1.02 ఎకరాల భూమి ఉందన్నారు. తమ పొలానికి వెళ్లడానికి దారి లేక అవస్థలు ఎదుర్కొంటున్నామన్నారు. ఉన్నతాధికారులు పరిశీలించి తమకు దారి సమస్య కల్పించాలని కోరారు.

అయ్యా దండం పెడుతున్నాం.. సమస్యలు పరిష్కరించండి

అయ్యా దండం పెడుతున్నాం.. సమస్యలు పరిష్కరించండి

అయ్యా దండం పెడుతున్నాం.. సమస్యలు పరిష్కరించండి

అయ్యా దండం పెడుతున్నాం.. సమస్యలు పరిష్కరించండి