
హత్యకేసులో నిందితుల అరెస్టు
యాదమరి: హత్యకేసులో నిందితులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. పచ్చిమ విభాగ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ నాయుడు, ఎస్‌ఐ ఈశ్వర్ కథనం మేరకు.. తొట్టిగానిఇండ్లకు చెందిన విజయ్‌కుమార్(26) తమిళనాడు రాష్ట్రం పరదరామిలో ఆవులు వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో తన వ్యక్తిగత అవసరాల కోసం సన్నిహితుల నుంచి రూ.5 లక్షల వరకు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పులు సమయానికి చెల్లించకపోవడంతో రుణదాతల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో కుటుంబసభ్యులను తన అప్పులను తీర్చమని వేధించసాగాడు. ఈ క్రమంలోనే ఈనెల పదో తేదీన తాను చేసిన అప్పులు చెల్లించడానికి అవసరమైన రూ.5లక్షలు ఇవ్వకపోతే ఇంటిల్లిపాదిని హతమారుస్తానని మద్యం మత్తులో బెదిరించాడు. ఈ క్రమంలో ఘర్షణ పడ్డారు. అప్పటికే హతుడు ఓ వివాహితతో వివాహేతర సంబంధం ఉండడంతో గ్రామంలో అవమానంగా భావించిన కుటుంబసభ్యులు ఆదివారం రాత్రి జరిగిన అగౌరవానికి భంగపడ్డారు. దీంతో హతుని తండ్రి సదాశివం, పెద్ద కుమారుడు శివకుమార్‌తో కలిసి పొలం దగ్గర నిద్రిస్తున్న విజయ్‌కుమార్‌పై విచక్షణా రహితంగా కర్రలతో దాడి చేసి గాయపరిచారు. కొనవూపిరితో కొట్టుమిట్టాడుతున్న అతడిని తాడుతో గొంతుకు బిగించి హతమార్చారు. అయితే ఎక్కడ తమపై అనుమానం వస్తుందోనని, పొలంలోని ఓ చెట్టుకు ఉరి వేసి హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే మృతుని తల్లి పరిమళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. హతునితోపాటు అతడి తండ్రి, సోదరుని శరీరంపై గాయాలుండంతో వారి ఇద్దరితోపాటూ మృతుని తల్లిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఐ ఈశ్వర్ తనదైన పందాలో విచారించగా హత్యను తామే చేసినట్లుగా సదాశివం, శివకుమార్ నేరాన్ని అంగీకరించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ ఈశ్వర్ చెప్పారు.