
దారి దోపిడీ దొంగల అరెస్టు
● రూ. 2 లక్షల విలువైన సొత్తులు స్వాధీనం ● ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
నగరి : స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగలు పి.సతీష్ (19), ఆర్.శంకర్ అలియాస్ అజిత్ (20), ఎంఎస్ విజయకుమార్ (20)ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీఐ విక్రమ్ కథనం మేరకు.. మోటార్ సైకిల్‌లో ఒంటరిగా వెళుతున్న వృద్ధులను టార్గెట్ చేసి వారి వద్ద నగదు, మొబైలు ఫోన్‌లు బలవంతంగా తీసుకోవడం, నగదు ఇవ్వకుంటే వారిపై దాడి చేసి గాయపరచడం తదితర దారి దోపీడీ సంఘటనలపై గత రెండు నెలలుగా నగరి పోలీస్ స్టేషన్ మూడు కేసులు నమోదు అయ్యాయి. వీటిని నివారించేందుకు డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్ పర్యవేక్షణలో ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 7 గంటలకు అందిన సమాచారం మేరకు, ఇన్‌స్పెక్టర్‌తో పాటు, నగరి ఎస్‌ఐ విజయనాయక్, ట్రైనీ ఎస్‌ఐ మారెప్ప, సిబ్బందితో వెళ్లి నగరి–తిరుత్తణి మెయిన్ రోడ్డు కీళపట్టు ఆంజనేయ స్వామి గుడి వద్ద మోటార్ సైకిల్‌పై వస్తున్న నిందితులు నగరి కాలనీకి చెందిన సతీష్, వేలావడికి చెందిన శంకర్ అలియాస్ అజిత్, కరకంఠాపురం కాలనీకి చెందిన విజయ్‌ను అరెస్టు చేశారు. వారిని విచారించగా పలు చోరీల్లో వారు ముద్దాయిలుగా తేలింది. దీంతో వారి వద్ద నుంచి ల్యాప్టాప్, ఫ్యాన్, గ్యాస్ సిలిండర్, బైకు, నోకియా సెల్‌ఫోన్, రూ.37570 నగదు తదితర రూ. 2 లక్షల మేర సొత్తును స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు. దారిదోపిడీ దొంగల అరెస్టులో ప్రతిభ చూపిన పోలీసులు లోకనాథం, ఇంద్ర కుమార్, గజేంద్ర, సురేష్, నవీన్, సత్య, గోపి, రవి, కదిర్ వేలుకు డీఎస్పీ ప్రశంసించారు.