
ఎన్నికల కమిషన్ బీజేపీ చేతిలో కీలుబొమ్మ
మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి
కార్వేటినగరం: ఎన్నికల కమిషన్ బీజేపీ చేతిలో కీలు బొమ్మగా మారి, పోలింగ్ వ్యవస్థను తారమారు చేసి ఆ పార్టీకి వంత పాడుతోందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. సోమవారం నారాయణస్వామి పుత్తూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగబద్ధంగా నిర్వహించాల్సిన ఎన్నికలను ఎన్నికల కమిషన్ బీజేపీకి వంత పాడుతూ ప్రజల ఓటుహక్కును కాలరాసిందని ఆరోపించారు. పోలింగ్ బూత్‌లో ప్రజలు వేసిన ఓట్లు ఏమయ్యాయని, దీనికి ఎన్నికల కమిషనే బాధ్యత వహించాలని డిమాండ్‌ఽ చేశారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని విధంగా బీజేపీ ఎన్నికల కమిషన్‌ను గుప్పెట్లో పెట్టుకుని ఎన్నికలు జరిపిస్తోందని, ప్రశ్నిస్తే కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు. ఎన్నికల కమిషన్ బేజేపీ కలసి చేసిన ఓట్ల చోరీ నిర్వాహకంపై దేశవ్యాప్తంగా చర్చించుకుంటోందన్నారు. ఓటర్ల సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందన్నారు.
దివ్యాంగులపై కూటమి క్రూరత్వం
వెదురుకుప్పం: సూపర్‌సిక్స్ అమలు చేస్తున్నామని చెబుతూ మరో పక్క దివ్యాంగులు, పేదలు, ఆటో కార్మికుల కడుపు కొట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. సోమవారం మండలంలోని ధర్మాచెరువు గ్రామంలో పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రపంచ చరిత్రలోనే సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారులకే డబ్బులు అందించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కిందన్నారు. సమాజంలో పేదరికంతో మగ్గిపోతున్న బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని గాలికొదిలేసినట్లు విమర్శించారు. వికలాంగులకు అందించే పింఛన్లలో కోతలు విధించి, వారిని రోడ్డున పడేసేందుకు కంకణం కట్టుకున్నట్లు చెప్పారు. జెడ్పీటీసీ సభ్యుడు సుకుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు మురగయ్య, రాజా రెడ్డి పాల్గొన్నారు.