
ప్యాక్‌హౌస్.. సబ్సిడీ మిస్
మామిడికి ధర కల్పించడంలో చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం ఆర్థికంగా చితికిపోయిన రైతులు ఇప్పుడు ప్యాక్ హౌస్ నిర్మాణాలతో మరింత ఆర్థిక భారం సబ్సిడీ కోసం ఎదురు చూపులు నిధులు జమ చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం
పుత్తూరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులు ప్రభుత్వ హామీని నమ్మి ప్యాక్ హౌస్‌లను నిర్మించుకుని ఆర్థికంగా మరింత కూరుకుపోయారు. కూటమి ప్రభుత్వం ప్యాక్ హౌస్ నిర్మాణాలకు అనుమతిస్తూ 50 శాతం సబ్సిడీ ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. దీంతో సబ్సిడీ అందుతుందనే నమ్మకంతో రైతులు నిర్మాణాలు చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1.8 లక్షల హెక్టార్లలో మమాడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఇందులో తోతాపురి దాదాపు 67 వేల హెక్టార్లలో సాగవుతోంది. ఏటా మంచి దిగుబడినిచ్చే తోతాపురి దిగుబడిని రైతులు అత్యధికంగా జ్యూస్ ఫ్యాక్టరీలకు తరలిస్తుంటారు. అయితే పక్వానికి వచ్చిన కాయలను రైతులు గ్రేడింగ్ చేసుకుని మంచి రేటుకు అమ్ముకునేందుకు వీలుగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్యాక్‌హౌస్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. సకాలంలో సబ్సిడీ మొత్తాలను అందించి రైతులకు ఆర్థిక తోడ్పాటునందించింది. అయితే కూటమి ప్రభుత్వంలో ప్యాక్ హౌస్‌లు నిర్మించుకున్న రైతులు సబ్సిడీ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్యాక్ హౌస్ అంటే ?
ఎంఐడీహెచ్– మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఉద్యానవన సమగ్రాభివృద్ధి మిషన్) పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో అమలు చేస్తున్న పథకమే ప్యాక్ హౌస్. మామిడి రైతులు పంట దిగుబడి సమయంలో కాయలను గ్రేడింగ్ చేసుకోవడం, నిల్వ ఉంచుకోవడానికి వీలుగా తోటల్లోనే ఏర్పాటు చేసుకునే చిన్నపాటి షెడ్డునే ప్యాక్ హౌస్ అంటారు. వీటిని గ్రామాల్లోని మామిడి తోటల్లో ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తారు. 20 అడుగుల వెడల్పు, 30 అడుగుల పొడవుతో, రేకుల పైకప్పుతో నిర్మాణం చేపట్టాలి. వీటిలో సాధారణంగా పంట దిగుబడి సమయంలో రోజువారిగా నాలుగు నుంచి ఐదు టన్నుల మేర నిర్వహణ సామర్థ్యం కలిగి ఉంటుంది.
50 శాతం సబ్సిడీ
ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లోని మామిడి తోటల్లో ఏర్పాటు చేసే ప్యాక్ హౌస్ నిర్మాణాలకు 50 శాతం సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటును అందిస్తోంది. ఒక్కో ప్యాక్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వ అంచనా వ్యయం రూ.4 లక్షలు. ఇందులో 50 శాతం సబ్సిడీ అంటే రూ.2 లక్షల ఆర్థిక తోడ్పాటును ప్రభుత్వం అందించాల్సి ఉంది. ఈ సబ్సిడీలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం చెల్లిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటాతో చెల్లించాల్సి ఉంది.
బడ్జెట్ రిలీజ్ అయింది
ప్రభుత్వం జిల్లాలో మొత్తం 30 ప్యాక్ హౌస్ నిర్మాణాలను మంజూరు చేసింది. ఇందుకోసం ఇటీవలే బడ్జెట్ రిలీజ్ అయింది. అయితే ప్యాక్ హౌస్ నిర్మాణాలు అసంపూర్తిగా ఉండడంతో సబ్సిడీ రిలీజ్ చేయడం లేదు. ప్యాక్‌హౌస్ నిర్మాణం అంటే ఒక్క షెడ్ మాత్రమే కాదు. అందులో రెండు ఫ్యాన్లు, ఐదు లైట్లు, గ్రేడింగ్ టేబుల్, వేవింగ్ మిషన్, ట్రేలు వంటి వస్తువులు సైతం ఏర్పాటు చేయాల్సి ఉంది. అన్నీ ఏర్పాటు చేస్తే సబ్బిడీ రిలీజ్ చేయడం జరుగుతుంది.
– బి.దశరథరామిరెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, తిరుపతి.
ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం
మా ప్రాజెక్టు పూర్తి చేసి 4 నెలలైంది. రూ.4 లక్షల అంచనా వ్యయంతో చేపట్టగా రూ.4.65 లక్షలు ఖర్చు అయింది. ఇందుకు సంబంధించి రిపోర్టు ప్రభుత్వానికి అందజేసి నెలలు గడుస్తున్నా ఇంకా సబ్బిడీ మొత్తం అందలేదు. సబ్సిడీ వస్తుందని కొంత అప్పు చేసి మరీ నిర్మాణం చేపట్టాం. ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. – ఎస్.ఉషారాణి, మహిళా రైతు, శాంతినగర్, పుత్తూరు

ప్యాక్‌హౌస్.. సబ్సిడీ మిస్

ప్యాక్‌హౌస్.. సబ్సిడీ మిస్