
ఓరియంటేషన్లు నిర్వహించండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 20, 21 తేదీల్లో ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఈ మేరకు శనివారం డీఈఓ కార్యాలయానికి ఉత్తర్వులు పంపారు. ఆ ఉత్తర్వుల మేరకు జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 20వ తేదీన మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై, ఈనెల 21న బాలికల కౌమార సమస్యలపై మహిళా ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
187 పింఛన్ల తొలగింపు
గుడిపాల: మండల పరిధిలో 187 పింఛన్లను తొలగించినట్లు ఎంపీడీఓ శిరీషా తెలిపారు. ఆమె మాట్లాడుతూ వికలాంగులు, మానసిక రోగులకు సంబంధించిన లబ్ధిదారులకు సర్టిఫికెట్లు సరిగ్గా లేనందున పింఛన్లు తొలగించినట్లు వివరించారు. మండలంలో వికలాంగులు, మానసిక రోగులు తదితరులు 838 మంది ఉన్నారని, అందులో సర్టిఫికెట్లు సరిగా ఉన్న వారు 651 మంది మాత్రమేనని పేర్కొన్నారు. పింఛన్లు తొలగించిన వారిలో 189 కొత్తపల్లెలో 14 మంది, 197రామాపురంలో 16, ఎఎల్‌పురం 07, బసవాపల్లె 13, బొమ్మసముద్రం 10, చీలాపల్లె 13, చిత్తపార 25, గుడిపాల 07, నంగమంగళం 16, మరకాలకుప్పం 01, నారగల్లు 07, పానాటూరు 22, పాపసముద్రం 12, పేయనపల్లె 04, రామభద్రాపురం 07, వసంతాపురం 11 మంది ఉన్నట్టు వెల్లడించారు.
నిత్యావసర సరుకుల వితరణ
కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి శనివారం ఓ దాత నిత్యావసర సరుకులు వితరణ చేశారు. తవణంపల్లి మండలం, మైనగుండ్లపల్లి గ్రామానికి చెందిన అంజిరెడ్డి రూ.2.5 లక్షల విలువ చేసే బియ్యం 5 టన్నులు, నూనె, కూరగాయలు అందజేశారు. అనంతరం వారికి ఆలయ అధికారులు స్వామివారి దర్శనం కల్పించారు. కార్యక్రమంలో ఏఈఓ రవీంద్రబాబు, సిబ్బంది కోదండపాణి పాల్గొన్నారు.