
చెరువులో మట్టి తరలింపుపై కలెక్టర్, ఎస్పీ సీరియస్
పెద్దపంజాణి: మండలంలోని బట్టందొడ్డి పంచాయతీ, కొత్తూరుగ్రామ సమీపంలోని ఎర్రచెరువులో మట్టి తవ్వకాలపై మండల అధికారులు ఎవ్వరూ స్పందించక పోవడంతో కలెక్టర్, ఎస్పీ నేరుగా రంగంలోకి దిగారు. దీంతో అక్రమార్కులు ఉడాయించారు. దీనిపై ఫిర్యాదు చేసిన పెద్దపంజాణి సింగిల్ విండో మాజీ చైర్మన్ శంకరప్ప వివరాల మేరకు.. మండలంలోని ఎర్రచెరువులో శనివారం ఉదయం నుంచి అధికార పార్టీకి చెందిన ఓ చోటా నాయకుడు శ్రీరామాపురం సమీపంలోని లేఅవుట్‌కు మట్టి తోలేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తాను అధికార పార్టీలో ఉన్నానని, తనను ఎవరు అడగుతారంటూ మూడు జేసీబీలు, 20 ట్రాక్టర్లతో మట్టిని తరలించడం ప్రారంభించాడు. దీనిపై తహసీల్దార్, ఎస్‌ఐ, మైన్స్, ఇరిగేషన్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమార్కులకు కొమ్ముకాయడంతో తాను చేసేదేమి లేక కలెక్టర్, ఎస్పీకి ఫొటోలు, వీడియోలు పంపినట్టు ఆయన వివరించారు. చివరకు జిల్లా ఉన్నతాధికారులు స్పందించడంతో విషయం తెలుసుకున్న చోటానాయకుడు వాహనాలతో సహా అధికారులు రాకముందే చెరువు నుంచి ఉడాయించాడని తెలిపారు.
మొగిలి ఘాట్‌లో లారీ బోల్తా
బంగారుపాళెం: మండలంలోని మొగిలి ఘాట్ వద్ద చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై శనివారం వేకువజామున లారీ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో కర్ణాటకలోని హసన్ నుంచి విజయవాడకు దానిమ్మ, ద్రాక్ష పండ్ల లోడ్డుతో వెళ్తున్న లారీ మొగిలి ఘాట్ వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో భయటపడ్డారు. రహదారిపై లారీ బోల్తా పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాకపోకలను పునరుద్ధరించారు.