
నేటి నుంచి రాజనాలబండ జాతర
చౌడేపల్లె : సత్య ప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ శ్రీ లక్ష్మినరసింహస్వామి ,శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం వద్ద నేటి నుంచి రెండు రోజులపాటు వైభవంగా జాతర జరగనుంది. టీటీడీ ఆధ్వర్యంలో సంప్రదాయ రీతిలో తిరుణాల జరగనుందన్నారు. ఏటా పూర్వీకుల నుంచి శ్రావణమాస చివరి శనివారం రోజున రాజనాలబండపై వెలసిన స్వామి వారికి ప్రత్యేక పూజలతో పాటు పక్కనే ఉన్న ఎత్తైన శ్రీలక్ష్మినరసింహస్వామి కొండపై భక్తులు తరలివెళ్లి పూజలు చేయడం ఆనవాయితీ. అదే రోజు రాత్రి కొండపై గల రాతి స్తంభంపై దీపం వెలిగించి అఖండ దీపారాధన చేస్తారు. స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను గ్రామాల్లో ఊరేగింపు చేపడుతారు. ఆదివారం రోజున కోలాహలంగా తిరుణాల నిర్వహిస్తారు. రాజనాలబండకు సమీపంలోని మొత్తం 18 గ్రామాలకు చెందిన ప్రజలు భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకొంటారు.కొలింపల్లె నుంచి గ్రామదేవత బోయకొండ గంగమ్మ తల్లి ఉత్సవమూర్తితో కలిసి ఊరేగింపుగా చేరుకొని బండారు పంపకం చేసిన అనంతరం సంప్రదాయ రీతిలో దేవరెద్దులు, బోయకొండ అమ్మవారిని రాజనాలబండకు చేర్చుతారు. వేల మంది భక్తులు వీరాంజనేయస్వామికి పూజలు చేసి మొక్కులు తీర్చుకోనున్నారు. అక్కడి నుంచి ఉట్లోత్సవం, పోకుమాను బరుగుట వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ మేరకు టీటీడీ విజిలెన్స్ ఇన్‌చార్జి ధర్మేంధ్ర ప్రసాద్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ భానుప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.