
పోలీసుల నిర్లక్ష్యంపై ఆందోళన
పుంగనూరు : కన్నబిడ్డ కూలీకెళ్లి మృతి చెందాడని, ట్రాక్టర్ యజమాని నిర్లక్ష్యం , సమాచారం కూడా ఇవ్వలేదని కన్నబిడ్డ మరణంపై చౌడేపల్లె పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు మరోలా కేసు నమోదు చేయడంపై బాధితులు ఆగ్రహించారు. శుక్రవారం పోలీసుల తీరుకు నిరసనగా ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. మృతుడి కుటుంబీకుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. చారాలకు చెందిన రవితేజ (25) ట్రాక్టర్‌లో పొలం మడి దున్నేందుకు వెళ్లి చౌడేపల్లె మండలం దుర్గసముద్రం వద్ద ఈనెల 14న మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడంతో పాటు, ప్రమాదం విషయాన్ని మృతుడి కుటుంబీకులకు తెలపలేదని బోరున విలపించారు.108 వాహనంలో కాకుండా ఆటోలో తరలించడంలో ఆలస్యం కావడంతోనే తమ బిడ్డ మృతి చెందాడని ఆరోపించారు. ప్రమాదం జరిగి 24 గంటలు పూర్తి అయినా పోలీసులు పోస్టుమార్టం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ ఘటనపై ట్రాక్టర్ యజమానిని అడగ్గా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని, పొలీసులు ఇచ్చిన ఫిర్యాదు కాకుండా మరోలా వారికి నచ్చినట్లు కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ కాపీని అందజేయడం వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీశారు. పోలీసులు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారి బాధితులకు న్యాయం చేయకుండా అన్యాయం చేయడం తగదని రోడ్డెక్కారు. విషయం తెలుసుకొన్న చౌడేపల్లె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని , ఎఫ్‌ఐఆర్‌లో మార్పులు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. కాగా చౌడేపల్లె పోలీసులపై పలు ఆరోపణలు చేశారు.