
పండుగకు వచ్చి ..నీట మునిగి చిన్నారి మృత్యువాత
శాంతిపురం : బంధువుల ఇంట కావడి పండుగ కోసం వచ్చిన నాలుగేళ్ల బాలుడు నీట మునిగి మృత్యువాత పడ్డాడు. కుప్పం మండలం మోట్లచేను సమీపంలోని బిక్కిలిగట్టు గ్రామానికి చెందిన నితీష్‌కుమార్ (4) తన అమ్మమ్మతో పాటు ఎంకేపురానికి వచ్చాడు. శుక్రవారం బంధువుల ఇంట్లో కావడి పండుగ పూజలు చూసి, భోజనం అనంతరం సాయంత్రం ఇంటి సమీపంలోని చెరువులో ఆడుకునేందుకు మరో ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లాడు. మిగతా పిల్లలు చూస్తుండగానే నితీష్‌కుమార్ నీటిలో పడిపోవడంతో వారు కేకలు వేస్తూ ఇంటికి వచ్చారు. గ్రామస్తులు వెళ్లి నీట మునిగిన బాలుడిని బయటకు తీసి శాంతిపురంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. గ్రామంలో సుబ్రమణ్యస్వామి భక్తులు కావడి పండుగతో ఉన్న కోలాహలం ఆవిరై ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. బిక్కిలిగట్టుకు చెందిన శంకర్, రూపకు ముగ్గురు సంతానం. కుమారుడు నితీష్‌కుమార్(మనోజ్) తర్వాత ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్నారి మృతదేహాన్ని కుప్పం మండలంలోని స్వగ్రామానికి తరలించారు.
అరాచకం రాజ్యమేలుతోంది
– వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన
తిరుపతి మంగళం : స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు అవుతోందని, అయితే రాష్ట్రం స్వాతంత్య్రం కోల్పోయి ఏడాదిన్నర అవుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఖండిస్తూ శుక్రవారం తిరుపతి పద్మావతిపురంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల హక్కులను పూర్తిగా హరించివేస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రజలు వాక్ స్వాతంత్య్రాన్ని కోల్పోతున్నామని, ప్రశ్నించే పరిస్థితులు లేకుండా పోతున్నాయని, ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకం, అవినీతి రాజ్యమేలుతోందని, ప్రశ్నించే వారిపై నిందారోపణలు మోపి, హింసలకు పాల్పడే వారిగా చిత్రీకరించి, కేసులు బనాయించి జైళ్లల్లోకి కుక్కి ప్రజస్వామ్యమనేది లేకుండా చేస్తోందని మండిపడ్డారు. ఏడాదిన్నర కిందట జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మొత్తం ఈవీఎంలన్నీ ట్యాపరింగ్ చేశారన్న విషయం దేశమే కోడై కూస్తోందన్నారు. ప్రజాస్వామ్యంగా పరిపాలించి రాష్ట్రంలోని పేదల ప్రజలకు సంక్షేమ రూపంలో రూ. 2.50 లక్షల కోట్లను పేద ప్రజలకు అందించిన గొప్ప నాయకుడైన వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా వారిని జైళ్లల్లోకి కుక్కే ప్రయత్నాలు నిరంతరం జరుగుతున్నాయన్నారు. ఈ రాష్ట్రంలో హక్కులు లేవు, భావప్రకటన స్వేచ్ఛ లేదు, ప్రశ్నించే మనుషులకు సంకెళ్లు పడుతున్నాయని ఆరోపించారు. ఈ కూటమి అరాచకాలపై ప్రజలంతా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నామే తప్ప రాష్ట్రంలో మాత్రం స్వాతంత్య్రం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తిరుపతి మేయర్ శిరీష, పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి పాల్గొన్నారు.