
మహిళలకు ఉచిత బస్సు ప్రారంభం
– ప్రారంభోత్సవంలో మంత్రి సత్యకుమార్
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండులో శుక్రవారం మహిళకు ఉచిత బస్సును రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎంపీ దుగ్గుమళ్ల ప్రసాద్‌రావు, ఎమ్మెల్యేలు గురజాల జగన్‌మోహన్, మురళీమోహన్, చుడా చైర్మన్ కఠారి హేమలత, మేయర్ అముద ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ఉచిత బస్సును ప్రారంభోత్సవం చేశారు. వీరంతా బస్సులో కాణిపాకం వరకు ప్రయాణం సాగించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.
కాణిపాకానికి ఎక్స్‌ప్రెస్ షో..
కాణిపాకానికి ప్రస్తుతం పల్లె వెలుగు సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. ఈ పల్లె వెలుగు బస్సులే నిత్యం చిత్తూరు– కాణిపాకానికి రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే ఉచిత బస్సు ప్రారంభోత్సవంలో భాగంగా చిత్తూరు–కాణిపాకానికి ఒక పల్లె వెలుగు బస్సుతో పాటు ఒక ఎక్స్‌ప్రెస్ బండిని నడిపారు. చిత్తూరు బస్టాండులో బస్సు బయలుదేరే క్రమంలో చిత్తూరు–తిరుపతి అనే బోర్డు తీసేసి చిత్తూరు–కాణిపాకం అనే బోర్డు పెట్టారు. దీంతో అక్కడున్న వారంతా ఆ బస్సుపై ఓ లుక్కేశారు. ఇకపై కాణిపాకానికి ఎక్స్‌ప్రెస్ బస్సు కూడా నడుపుతారని ఊహించారు. అయితే ఈ ఎక్స్‌ప్రెస్ బండి కాణిపాకానికి షో మాత్రమేనని పలువురు విమర్శలు చేశారు.