
అమ్మో.. ఏపీకే ఫైల్స్!
● వాట్సాప్‌లో వాటిని టచ్ చేస్తే ఫోన్ హ్యాంకింగ్ ● జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు
పలమనేరు: నేటి సమాజంలో మనిషి జీవితంలో సెల్‌ఫోన్ అత్యంత ముఖ్యంగా మారిపోయింది. ఏ మాత్రం ఖాళీ దొరికినా సెల్‌ఫోన్‌లో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రా, యూట్యూబ్‌లను చూస్తూ గడిపేస్తున్నారు. ఇదే అదునుగా హ్యాకర్లు సైతం వాట్సాప్‌లకు ఏపీకే ఫైల్స్‌ను పంపి వాటిని టచ్ చేయగానే ఫోన్ సెకండ్లలో హ్యాక్ చేస్తున్నారు. ఆపై మన ఫోనులోని సమాచారం కమాండ్ కంట్రోల్ మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళుతోంది. దీంతో మన ఫోన్‌లోని పాస్‌వర్డ్‌ల ఆధారంగా బ్యాంకు ఖాతాలోని మొత్తం నగదు ఖాళీ అవుతుంది. వ్యక్తిగత సమాచారాన్ని హరించే ఇలాంటి ఏపీకే మెసేజ్‌ల పట్ల సెల్ వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇంతకీ ఏపీకే అంటే
ఏపీకే అంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఫ్యాకేజీ అని అంటారు. ఇది యాప్ ప్రాజెక్ట్‌లో ప్రధానమైంది. దీని ద్వారా మన సెల్‌లోని వాట్సాప్‌కు పలు రకాల మెసేజ్‌లు నిత్యం వస్తూనే ఉంటాయి. వీటిని మనం టచ్ చేసిన వెంటనే మన ఫోన్‌లోని మొత్తం సమాచారం హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. మనం దీన్ని సరిచేసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
ఎలా ఏమార్చుతారంటే!
మన సెల్‌లోని వాట్సాప్‌లో ఎన్నో గ్రూపులుంటాయి. వీటిల్లో హ్యాకర్లు చొరబడి ఉంటారు. ఏపీకే పేరిట మనల్ని ఏమార్చే ఆధార్ అప్‌డేట్ చేసుకోండని, ఎస్‌బీఐ ఈకేవైసీ చేసుకోవాలని, పీఎం కిసాన్ పడిందా లేదా చూడాలని ఇలా రకరకాలుగా వస్తుంటాయి. పొరబాటున ఏపీకే పై టచ్ చేశామో మనం ఫోన్‌కు పిచ్చిపట్టినట్టు మారిపోతుంది. మన ఫోన్‌ని హ్యాకర్లు విదేశాల నుంచి ఆపరేట్ చేయడం మొదలు పెడుతారు. మనం స్విచ్‌ఆఫ్ చేసినా ఇక లాభం లేదు. మన సమాచారం, బ్యాంకులకు సంబంధించిన ఫోన్‌ఫే, గుగూల్‌పేలాంటి పిన్‌లు వివరాలన్నీ వారి చేతుల్లోకి చేరిపోతాయి. మన ఫోన్ ద్వారా నగదును సులభంగా తస్కరించే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే వేలాది మంది ఫోన్లు హ్యాక్
చిత్తూరు జిల్లాలోనే గత ఆరు నెలల్లో వేలాది మంది ఫోన్లు ఏపీకే ఫైల్ కారణంగా హ్యాక్‌కు గురయ్యాయి. ఫలితంగా లక్షలాది రూపాయలను హ్యాకర్లు చోరీ చేశారు. మోసం జరిగాక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆపై పోగొట్టుకున్న నగదు తిరిగి రావడం చాలా కష్టమే.
ఏపీకే ఫైల్ ఇన్‌స్టాల్ అయ్యాక ఏం చేయాలంటే
● గూగూల్‌పే ప్రొటెక్ట్ ఆఫ్షన్ ట్యాప్ చేసి స్కాన్ చేయాలి
● హామ్‌ఫుల్ యాప్స్ కనిపిస్తే దాన్ని డిలీట్ చేయాలి
● సెట్టింగ్స్‌లో డివైజ్‌ౖ మె యాప్స్‌లో ఫైండ్ మై డివైజ్‌ను ఆన్ చేయాలి
● మొబైల్ డేటాను బ్యాక్‌అప్ చేసి రీస్టార్ట్ చేసి ఆపై కొత్త పాస్‌వర్డ్‌ను పెట్టుకోవాలి.
చాలా జాగ్రత్తగా ఉండాలి
ఇటీవల వాట్సాప్ గ్రూపుల్లో మన అవసరాలను బట్టి రకరకాలుగా సేవల పేరిట ఏపీకే యాప్స్ వస్తున్నాయి. ఇవి మనకు ఉయయుక్తంగా ఉంటాయని వాటిపై టచ్‌చేస్తే ఇక అంతే సంగతులు. సమస్యలు తెచ్చుకుని ఇబ్బందులు పడేదానికంటే మనం తగిన జాగ్రత్తలు పాటిస్తే మంచిది. స్మార్ట్‌ఫోన్‌లో అన్ని రకాల సేప్టీ మెజర్స్‌ను పాటించాలి.
– డేరంగుల ప్రభాకర్, డీఎస్పీ, పలమనేరు

అమ్మో.. ఏపీకే ఫైల్స్!