
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించేలా క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పలుశాఖల అధికారులతో వరుస సమావేశాలను నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా ప్రమాదం జరిగిన వెంటనే పోలీసు, రెవెన్యూ శాఖలతో పాటు అత్యవసర వైద్యసేవలకు అవసరమైన సమాచారం సిద్ధంగా పెట్టుకోవాలన్నారు. జిల్లాలోని బ్లాక్ స్పాట్స్‌లో దగ్గరలో ఉన్న ఆసుపత్రులు, డాక్టర్‌లు, అంబులెన్స్‌లు ఇతర ముఖ్యమైన సమాచారం సిద్ధం చేయాలన్నారు. అధికంగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 451 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా 221 మంది మృతి చెందారన్నారు. ప్రమాదాల నివారణకు జాతీయ రహదారుల్లో స్పీడ్ బ్రేకర్‌లు, రంబుల్ స్టిక్, సోలార్ లైటింగ్, సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రం నుంచి తిరుపతికి వెళ్లే వాహనదారులు సూచిక బోర్డులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారన్నారు. సమావేశంలో డీఎఫ్‌వో భరణి, ఆర్‌టీవో నిరంజన్‌రెడ్డి, డీఈవో వరలక్ష్మి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు అందుతున్నాయా?
జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజనులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అందజేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? అని పరిశీలించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు పలు శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నేషనల్ లెవల్ మానిటరింగ్ (డిల్లీ బృందం) ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించారన్నారు. సమావేశంలో బృందం సభ్యులు మణికందన్, ప్రశాంత్, జెడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి, హౌసింగ్ పీడీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.