
దేశాభివృద్ధిలో భాగస్వాములుకావాలి
చిత్తూరు కలెక్టరేట్ : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ గాంధీ సర్కిల్ నుంచి ఎంఎస్‌ఆర్ సర్కిల్ మీదుగా నాగయ్య కళాక్షేత్రం వరకు చేపట్టారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు ప్రతి గ్రామం, ప్రతి జిల్లాలో రెండు వారాల పాటు స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించాలన్నారు. ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరు జెండా పట్టుకుని తిరగడమే కాకుండా దేశభక్తిని చాటాలన్నారు. యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని 2 వేల మంది విద్యార్థులతో మువ్వన్నెల జెండాతో ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఈనెల 15 వ తేదీన పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించే స్వాతంత్య్ర వేడుకల్లో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ పతాకావిష్కరణ చేస్తారన్నారు.
డ్రగ్స్ సమాజానికి ప్రమాదకరం
సమాజంలో డ్రగ్స్ వాడకం పెరిగిందని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. డ్రగ్స్ సమాజానికి ప్రమాదకరంగా మారిందన్నారు. యువత జీవితాన్ని నాశనం చేసే డ్రగ్స్ కు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. మత్తుపదార్థాల రవాణా, అమ్మకం, వాడకం, తదితరులకు సంబంధించి సమాచారం తెలిస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మాట్లాడుతూ.. చిత్తూరు నియోజకవర్గాన్ని డ్రగ్ ఫ్రీ చిత్తూరుగా మార్చేందుకు ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ అముద, ఏఎస్‌పీ రాజశేఖర్, డీఈవో వరలక్ష్మి పాల్గొన్నారు.