
ఉప ఎన్నికల్లో కూటమి అరాచకాలు
వి.కోట : కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి నేతల అరాచకాలు మిన్నంటాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పీఎన్ నాగరాజు ఆరోపించారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు నిర్వహించిన ఒక్క పోలింగ్ బూత్‌లోనూ వైఎస్సార్ సీపీ ఏజెంట్ లేకుండా పోలీసులు వ్యవహరించడం దారుణమన్నారు. బయటి ప్రాంతాల వారు యథేచ్ఛగా దొంగ ఓట్లు వేస్తున్నా పోలీసులు అడ్డుకోకపోవడం సరికాదన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే ప్రజలు ఓట్లు వేయడానికి వెళ్లకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. ఇంతటి దారుణమైన ఎన్నికలు ఎన్నడూ చూడలేదన్నారు. ఈ ఎన్నికను రద్దు చేసి కేంద్ర బలగాల నడుమ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
పక్షవాతానికి మందు ఇస్తానని మోసం
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : పక్షవాతానికి మందు ఇస్తానని చెప్పి ఓ గుర్తు తెలియని వ్యక్తి మోసం చేశాడని బుధవారం తాలూకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు.. చిత్తూరు నగరం మురకంబట్టులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన నాగమ్మ భర్త కొన్నాళ్లుగా కాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. నల్ల సంచితో ఇంటి వద్దకు వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి నాగమ్మను పలకరించి ఆమె ద్వారా భర్తకు కాళ్ల నొప్పి సమస్య ఉందని తెలుసుకున్నాడు. తాను పక్షవాతానికి మందు ఇస్తానని నొప్పులు నయం అయిన తర్వాత ఆలయానికి దానం చేయమని నాగమ్మను గుర్తుతెలియని వ్యక్తి నమ్మించాడు. కొబ్బరి నూనె తీసుకురమ్మని చెప్పి.. సంచిలోని పదార్థాలను తీసి నూనెలో కలిపాడు. తొందరగా నయమవుతుందని ఆమెను పూర్తిగా నమ్మేలా చేశాడు. ఆతర్వాత బంగారు ఆభరణాలను అడిగాడు. ఇంటికెళ్లి పూజ చేసి ఇస్తామని చెప్పి వెళ్లిపోయాడు. తిరిగీ రాకపోయే సరికి మోసపోయామని తెలుసుకున్న నాగమ్మ తాలూకా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. రూ. 80 వేలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను మోసగిచ్చినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.