
రైతులకు న్యాయం చేయాలి
తవణంపల్లె : అన్నదాత సుఖీభవ పథకంలో లోపాలను సరిదిద్ది రైతులకు న్యాయం చేయాలని జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్రపాడేల్ సూచించారు. బుధవారం తవణంపల్లె రెవెన్యూ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. రెవెన్యూ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూశాఖ అధికారులతో అన్నదాత సుఖీభవ పథకంపై సమీక్షించారు. మండలంలోని ఎంత మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు, ఎంత మంది రైతుల ఖాతాలకు నగదు జమ అయ్యింది అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈకేవైసీ, ఆధార్, సెల్ నంబరు లింకేజీ వివిధ కారణాలతో కొంత మంది రైతులకు అన్నదాత సుఖీభవ అందడంలేదన్నారు. వ్యవసాయ శాఖ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది రైతులతో కలసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో వీఆర్‌ఓలు, రైతు సేవా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో 3,100 టన్నుల యూరియా నిల్వలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో 3100 టన్నుల యూరియా నిల్వలు ఉన్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీకృష్ణ తెలిపారు. మంగళవారం వరకు జిల్లా వ్యాప్తంగా 3 వేల టన్నుల యూరియా నిల్వ ఉండిందన్నారు. కేరళ నుంచి 100 టన్నుల యూరియా బుధవారం సాయంత్రం జిల్లాకు చేరిందన్నారు. రైతులకు అవసరమైన మేర యూరియా అందజేస్తామని పేర్కొన్నారు.