ఆగేది రామాపురమే!
● బుల్లెట్ ట్రైన్‌కు జిల్లాలో ఒక్కటే స్టాపింగ్ పాయింట్ ● మైసూరు–చైన్నె మార్గానికి భూసేకరణకు సిద్ధం ● జిల్లాలో 41 రెవెన్యూ గ్రామాల మీదుగా లైన్
పలమనేరు : చైన్నె– మైసూరు బుల్లెట్ ట్రైన్ మార్గానికి సంబంధించి ఫీల్ట్ వర్క్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ డీటైల్డ్ సోషియల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (ఎస్‌ఐఏ), రీ సెటిల్‌మెంట్ యాక్షన్ ప్లాన్ (ఆర్‌ఏపీ)లను వెంటనే సిద్ధం చేయాలని ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీల్ (నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్) జీఎం నిషాంత్ సింఘాల్ నుంచి జిల్లా కలెక్టర్‌కు తాజాగా ఆదేశాలందాయి. మైసూరు నుంచి చైన్నె దాకా 463 కిలోమీటర్ల దూరం వెళ్లే ఈ మార్గం చిత్తూరు జిల్లాలోని పలమనేరు, బంగారుపాళెం, చిత్తూరు నియోజకవర్గం మీదుగా 77 కి.మీ మేర వెళ్లనుంది.
జిల్లాలో 41 గ్రామాల్లో వెళ్లనున్న మార్గం
కర్ణాటక నుంచి బైరెడ్డిపల్లి మండలంలోని కంభంపల్లి, ఆలపల్లి, జీసీపల్లి, లక్కనపల్లి, శెట్టిపల్లి, బేలుపల్లి, అంకింవారిపల్లి, అయ్యంరెడ్డిపల్లి, గుండ్లపల్లి, కొలమాసనపల్లి, మొరం, జల్లిపేట, కూర్మాయి, పలమనేరు, సముద్రపల్లి, పెంగరగుంట, పూతలపట్టు నియోజకవర్గంలోని మొగిలి, టేకుమంద, గొల్లపల్లి, రాగిమాను పెంట, బోడబండ్ల, కూర్మాయిపల్లి, చిత్తూరు నియోజకవర్గంలోని బుడితిరెడ్డిపల్లి, యాదమరి, పెరియంబాడి, జంగాళపల్లి, మాధవరం, మాపాక్షి, 190 రామాపురం, కొత్తపల్లి, వసంతాపురం, బసవపల్లి, పసుమంద, కుప్పిగానిపల్లి, రాగిమాను పట్టెడల మీదుగా తమిళనాడులోకి ప్రవేశిస్తుంది. ఈ గ్రామాల్లో 876 మంది రైతుల భూములను సేకరించనున్నారు.
జిల్లాలో ఒక్కటే..
మైసూరు నుంచి చైన్నె దాకా మొత్తం తొమ్మిది చోట్ల స్టాపింగ్‌లున్నాయి. ఇందులో కర్ణాటక రాష్ట్రంలో 5, తమిళనాడులో 3 చోట్ల బుల్లెట్ ట్రైన్ ఆగనుంది. చిత్తూరు జిల్లాలో మాత్రం 190–రామాపురం వద్ద మాత్రమే చిత్తూరు జిల్లా స్టాపింగ్‌గా పెట్టారు.


