బాధ్యత లేదా?
● ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారు ? ● లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తుంటే సమాచారం ఎందుకు చేరలేదు ● శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా తెలుస్తోంది ● ఆడ పిల్లల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత ● వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్ శాఖలపై కలెక్టర్ ఆగ్రహం
సరిహద్దు మండలాల్లో ఎక్కువ
జిల్లాలో ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న నగరి, పలమనేరు, పుంగనూరు, వి.కోట మండలాల్లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో అనుమతి లేకుండా జరుగుతున్న అబార్షన్ల శాతం ఎక్కువగా ఉందన్నారు. డివిజన్‌ల వారీగా ఆర్‌ఎంపీ డాక్టర్‌లతో సమావేశాలు నిర్వహించి స్పష్టమైన ఆదేశాలివ్వాలన్నారు. మెడికల్ షాపుల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వకూడదనే విషయాన్ని తెలియజేయాలని డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు. అనధికారికంగా స్కానింగ్ మిషన్‌లు అమ్ముతున్న వారిపై నిఘా పెట్టాలన్నారు. ఈ సమావేశంలో మొదటి అదనపు జిల్లా జడ్జి రమేష్, డీఎఅండ్‌హెచ్‌వో సుధారాణి, ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి, డీఐవో హనుమంత రావు, జిల్లా ప్రధాన వైద్య శాఖ సూపరింటెండెంట్ ఉషశ్రీ, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ కీర్తన, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ మహేశ్వర్, ఎస్‌ఐ నాగసౌజన్య పాల్గొన్నారు.
చిత్తూరు కలెక్టరేట్ : లింగ నిర్ధారణ పరీక్షలు అరికట్టడంలో అధికారులకు బాధ్యత లేదా..? అంటూ కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లో శనివారం పీసీపీఎన్‌డీటీ యాక్ట్ 1994 జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం ఎందుకు తెలియలేదని మండిపడ్డారు. శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా తెలుస్తోందన్నారు. జిల్లా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దులో ఉండడంతో పీసీపీఎన్‌డీటీ యాక్ట్ నియమ నిబంధనలకు విరుద్ధంగా జిల్లా కేంద్రంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తుంటే ఎందుకు తెలుసుకోలేక పోయారని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో ఆశా, ఏఎన్‌ఎంలు స్థానికంగా ఉన్నప్పటికీ మొదటి, రెండు సంతానాలలో ఆడపిల్లలు ఉండి మూడవ సారి గర్భం దాల్చిన విషయం ఎందుకు తెలుసుకోలేక పోతున్నారన్నారు.
సమావేశాలు ఎప్పుడైనా నిర్వహించారా?
జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు కలసి సీడీపీఓలు, మెడికల్ ఆఫీసర్లతో కలసి గత పదేళ్లలో ఎప్పుడైనా సమన్వయ సమావేశాలు నిర్వహించారా..? అని ప్రశ్నించారు. రెండు శాఖల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. జిల్లాస్థాయి అధికారులు ఇద్దరు వ్యక్తిగతంగా ఆశా, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ కార్యకర్తలతో మాట్లాడితే క్షేత్రస్థాయి పరిస్థితులు కొంత వరకు అర్థమవుతాయన్నారు. అబార్షన్‌లతో ఆడపిల్లలు చనిపోతే, ఆడపిల్లల నిష్పత్తి మరింత తగ్గుతుందన్నారు. జిల్లాలో 2024 నివేదికల ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుషులకు 947 మంది సీ్త్రలు ఉన్నట్లు తెలిపారు.


