చిత్తూరుకు ఐపీఎస్‌ తరుణ్‌ పహ్వ | - | Sakshi
Sakshi News home page

చిత్తూరుకు ఐపీఎస్‌ తరుణ్‌ పహ్వ

Dec 30 2025 7:40 AM | Updated on Dec 30 2025 7:40 AM

చిత్త

చిత్తూరుకు ఐపీఎస్‌ తరుణ్‌ పహ్వ

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు పోలీసు జిల్లాలో ఆరు నెలల శిక్షణ నిమిత్తం ఐపీఎస్‌ అధికారి డా.తరుణ్‌ పహ్వ నియమితులయ్యారు. సోమవారం చిత్తూరు ఎస్పీ తుషార్‌ డూడీని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేశారు. హర్యాణ రాష్ట్రం, చర్కీదాద్రీ జిల్లాకు చెందిన తరుణ్‌ 2020లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. గతేడాది ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఆర్నెళ్ల పాటు జిల్లాలో పోలీసు పరిపాలనపై శిక్షణ పొందనున్నారు.

జీఎస్టీ మోసంపై ఎస్పీకి ఫిర్యాదు

చిత్తూరు అర్బన్‌: చిత్తూరులో వెలుగు చూసిన ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను (ఐటీసీ) దోచుకోవడంపై సోమవారం ఎస్పీ తుషార్‌ డూడీకి ఫిర్యాదు చేశారు. సంతపేటకు చెందిన కొందరు వ్యక్తులు తన ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుని.. ఓ కంపెనీ స్థాపించి జీఎస్టీ పేరిట భారీగా ఐటీసీ దోచుకోవడంపై విజయ్‌చక్రవర్తి అనే వ్యక్తి ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఏఐటీయూసీ నాయకుడు నాగరాజన్‌తో కలిసి ఎస్పీకి వినతిపత్రం అందచేశారు. తనకు ఇందులో సంబంధంలేదని పేర్కొన్నాడు. అయితే బాధిత వ్యక్తి ప్రమేయం లేకుండా రూ.కోట్లలో లావాదేవీలు ఎలా జరిగాయంటూ ఎస్పీ ప్రశ్నించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

పోలీసు గ్రీవెన్స్‌కు 50 ఫిర్యాదులు

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలోని ఏఆర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి 50 వినతులు అందాయి. ఎస్పీ తుషార్‌ డూడీ ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్‌ హౌస్‌ అధికారులతో మాట్లాడారు. ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. అలాగే చిత్తూరు ఏఎస్పీ రాజశేఖరరాజు, చిత్తూరు డీఎస్పీ సాయినాథ్‌ సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.

తాగి రోడ్లపైకి వస్తే చర్యలు!

చిత్తూరు అర్బన్‌: ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ వారి కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడం ఉత్తమమని చిత్తూరు ఎస్పీ తుషార్‌ డూడీ సూచించారు. అలాకాదని తప్పతాగి రోడ్లపైకి రావడం, సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తూ న్యూసెన్స్‌ చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. 31వ తేదీ రాత్రి 9 నుంచి.. తెల్లవారు జాము వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు గస్తీ ఉంటుందన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు, బ్లూకాట్స్‌, రక్షక్‌ వాహనాలతో నిత్యం పహారా ఉంటుందన్నారు. వేడుకల పేరిట ఎవ్వరికీ ఇబ్బందులు కలిగించొద్దని.. కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడం మంచిదని సూచించారు.

డయల్‌ యువర్‌ ఎస్‌ఈకి ఏడు ఫిర్యాదులు

చిత్తూరు కార్పొరేషన్‌: విద్యుత్‌ సమస్యల పరిష్కారం కోసం సోమవారం జిల్లాలో డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయంలో ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్‌ ఫిర్యాదులను స్వీకరించారు. సోమల నుంచి ఫోన్‌లో మాట్లాడుతూ పైకం చెల్లించినా వ్యవసాయ సర్వీసును విడుదల చేయలేదని ఫిర్యాదు చేశారు. అలాగే బార్బర్‌షాప్‌నకు విద్యుత్‌ సబ్సిడీ మంజూరు చేయాలని కోరారు. చిత్తూరులోని మురకంబట్టు, ఆర్వీఎస్‌ నగర్‌ నుంచి లోఓల్టేజీ సమస్య ఉందని అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు, కేబుల్‌ మార్పు చేయాలని వినియోగదారులు తెలిపారు. యాదమరి నుంచి సోలార్‌కు నెట్‌ మీటర్‌ ఏర్పాటు చేయాలని, బైరెడ్డిపల్లె నుంచి వ్యవసాయ సర్వీసు విడుదల చేయాలని, నిండ్ర నుంచి వ్యవసాయ సర్వీసుకు అంచనా వేయాలని, గంగవరం నుంచి ఓల్టేజీ సమస్య తీర్చాలని ఫిర్యాదులు వచ్చాయి.

చిత్తూరుకు ఐపీఎస్‌ తరుణ్‌ పహ్వ 
1
1/1

చిత్తూరుకు ఐపీఎస్‌ తరుణ్‌ పహ్వ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement