హెచ్‌పీవీతో క్యాన్సర్ కిల్!
సర్వైకల్ క్యాన్సర్ నియంత్రణకు వ్యాక్సిన్ 14 ఏళ్లు నిండిన వారికి ఉచితంగా ఇచ్చేలా ప్రణాళిక సన్నాహాలు చేస్తున్న వైద్యారోగ్యశాఖ అధికారులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): సర్వైకల్ క్యాన్సర్‌ను నియంత్రించే హెచ్‌పీవీ టీకాను కిశోర బాలికలకు ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ భావించింది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు శిక్షణ ఇచ్చింది. వైద్యులు, వైద్య సిబ్బంది గ్రామాల్లో, పట్టణాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి 14 ఏళ్లు నిండి 15 ఏళ్లలోపు ఉన్న బాలికలను గుర్తించనున్నారు. కాగా ఇప్పటి వరకు వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 53 వేల మంది కిశోర బాలికలు ఉన్నట్టు అంచనా. వారికి ఒక డోసు హెచ్‌పీవీ టీకా వేస్తే భవిష్యత్‌లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పు తలెత్తకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
పెరుగుతున్న కేసులు
మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌తో పాటు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు పెరుగు తున్నాయి. హ్యుమన్ పాపిలోమా వైరస్ కారణంగా ఇది సోకుతుంది. ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొన్నేళ్ల పాటు వృద్ధి చెంది క్యాన్సర్‌కు కారణమవుతుంది. ఈ వ్యాధిని మొదటి దశలో గుర్తించక పోతే ప్రమాదమే. అందుకే ప్రభుత్వం బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ఉచితంగా వేయాలని నిర్ణయించింది. టీకా జిల్లాకు రాగానే సిబ్బంది 14ఏళ్లు నిండిన బాలికలను గుర్తించనున్నారు.
ఎన్‌సీడీ 4.0లో..
గతనెల రోజులుగా జిల్లాలో ఎన్‌సీడీ సర్వేను చేపడుతున్నారు. 16 లక్షల మందిని సర్వే చేయాల్సి ఉండగా...ఇప్పటి వరకు 4 లక్షల మందిని సర్వే చేశారు. ఈ సర్వేలో ఇది వరకు ఓరల్ క్యాన్సర్ ఉన్న వారు 160 మంది బయటపడ్డారు. బ్రెస్ట్ క్యాన్సర్ 124 మందికి ఉన్నట్లు గుర్తించారు. సర్వైకల్ క్యాన్సర్ 98 మందికి ఉన్నట్లు నిర్థారించారు. సర్వే పూర్తయితే సర్వైకల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వారి సంఖ్య 300 దాటొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇక ఓరల్ క్యాన్సర్‌లో కూడా మహిళలే అధికంగా ఉంటున్నట్టు సమాచారం.
టీకా ఇచ్చేలా..
ముందుగా కిశోర బాలికలకు టీకా ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి పీహెచ్‌సీ, అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులకు శిక్షణ ముగిసింది. బడిలో చదివే కిశోర బాలికలను గుర్తించాలని ఆదేశించారు. త్వరలో వారికి టీకాలు ఇవ్వనున్నారు.
సర్వైకల్ క్యానర్స్ లక్షణాలు
యోని నుంచి రక్తస్రావం
లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం
రుతు క్రమంలో సమస్యలు
పీరియడ్స్ ఆగిపోయినా తర్వాత రక్తస్రావం
మూత్రం, మల విసర్జనలో ఆటంకాలు
యోని నుంచి దుర్వాసన, రక్తంతో కూడిన గడ్డలు రావడం
పొత్తి కడుపులో నొప్పి, బరువు తగ్గడం, నీరసం, విరేచనాలు, కాళ్లవాపు వంటి సమస్యలు
మహిళల్లో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌ను కట్టడి చేసేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధమైంది. అందుకోసం జిల్లాలో 14 ఏళ్లు నిండిన కిశోర బాలికలకు హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకాను ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాంగంగా సోమవారం సీహెచ్‌సీ, పీహెచ్‌సీ వైద్యులకు శిక్షణ పూర్తి చేసింది. బాలికల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఖరీదైన ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమైంది.
స్క్రీనింగ్ టెస్టు చేయించుకోవాలి
మహిళలు మూడేళ్లకు ఒకసారి స్క్రీనింగ్ టెస్టు చేయించుకోవాలి. ఈ టెస్టులపై నిర్లక్ష్యం వద్దు. అలాంటప్పుడే ఈ సర్వైకల్ క్యాన్సర్‌ను గుర్తించగలం. లేకుంటే అది ప్రమాదకరంగా మారుతుంది. ఇక 9 నుంచి 14 ఏళ్ల వయస్సులోని బాలికలు రెండు డోస్‌ల హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించుకోవాలి. అలాగే పెళ్లికి ముందు కూడా వ్యాక్సినేషన్ వేసుకోవడం ఉత్తమం. ఈ విషయలో నిర్లక్ష్యం చేయకండి. బాలికలతో పాటు మహిళలు కూడా సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కలిగి ఉండాలి.
ఉషశ్రీ, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వాస్పత్రి, చిత్తూరు
హెచ్‌పీవీతో క్యాన్సర్ కిల్!


