రెండేళ్లుగా.. ఏం చేస్తున్నారు?
పెన్షన్ల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నా పట్టించుకోరా? ఒక్క పెన్షన్ అయినా మంజూరు చేశారా? ఇక ప్రతి సోమవారం వినతులు స్వీకరిస్తా మాజీ మంత్రి పెద్దిరెడ్డి వెల్లడి
పుంగనూరు: ‘తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది. ప్రతిపక్ష పార్టీలపై కేసులు, అరెస్ట్‌లు చేయడమే పనిగా పెట్టుకుంది’..అని మాజీ మంత్రి , ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మున్సిపాలిటీలో ప్రజా సమస్యలపై తొలిసారిగా వినతులు స్వీకరించారు. ప్రజలతో విడివిడిగా మాట్లాడి, సమస్యలు తెలుసుకున్నారు.
పింఛన్ లేదయ్యా!
ప్రజలు చాలా మంది పింఛన్ల కోసమే ఎక్కువగా వినతులు సమర్పించారు. దివ్యాంగ పెన్షన్లు , మూడు చక్రాల సైకిళ్లు కావాలని కోరారు. అలాగే వితంతువులు పెన్షన్లు కావాలని, మహిళలు ఇంటి పట్టాలు కావాలని అభ్యర్థించారు. నక్కబండ ప్రాంతంలో గత ఇరవై రోజులుగా మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదని ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి స్పందిస్తూ వాటిని అప్పటికప్పుడే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి సోమవారం వినతులు స్వీకరిస్తా
అనంతరం మాజీ మంత్రి పెద్దిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఇకపై ప్రతి సోమవారం ప్రజా వినతులు స్వీకరించి, సమస్యలు పరిష్కరించేందుకు ఒక్కొక్క మండలంలో పర్యటిస్తానన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని మండి పడ్డారు. ‘ఈ ప్రభుత్వంలో నలుగురు తపేదారులు ఉన్నారు. వారికి డబ్బులిస్తే సరిపోతుంది. ప్రజా సమస్యలు పరిష్కరించకపోయినా పరవలేదు అనే ధోరణిలో అధికారులు పనిచేస్తే సహించేది లేదు’ అన్నారు. మా పార్టీ కార్యకర్తలే సమస్యల పరిష్కారం కోసం పోరాటం సాగిస్తారని హెచ్చరించారు. అప్పటికీ అధికారుల్లో మార్పు రాకపోతే అలాంటి వారిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.
స్వలాభం కోసమే!
టీడీపీ అధికారంలోకి వచ్చినరోజు నుంచి ఆ పార్టీ కార్యకర్తలు, అధికారులు కలసి స్వలాభం చూసుకుంటున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. అధికారులు తమ అధికారాలను దుర్వినియోగం చేయకుండా ప్రజల కోసం సద్వినియోగం చేయాలని కోరారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప, మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, వక్ఫ్ బోర్డు మాజీ జిల్లా చైర్మన్ అమ్ము, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఇర్ఫాన్, ఎంపీపీ భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు అనీషారెడ్డి, శ్రీనాథరెడ్డి, కొండవీటి నాగభూషణం, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, కమిషనర్ మధుసూదన్‌రెడ్డి, తహసీల్దార్ రాము పాల్గొన్నారు.


