
● బాబు జన్మదిన కానుకగా నోటిఫికేషన్ ● దళితులకు, బీసీలకు
ఉమ్మడి చిత్తూరు జిల్లా సమాచారం
ప్రాథమిక పాఠశాలలు 3,766
ప్రాథమికోన్నత పాఠశాలలు 444
ఉన్నత పాఠశాలలు 705
ఉమ్మడి జిల్లాలో 1,478 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
చిత్తూరు కలెక్టరేట్ : అధికారంలోకి రాగానే డీఎస్సీ పరీక్షను నిర్వహిస్తామంటూ గత ఎన్నికల సమయంలో టీడీపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక సీఎంగా ప్రమాణ స్వీకారం రోజున చంద్రబాబు మెగా డీఎస్సీ పరీక్ష ఫైల్‌పై తొలి సంతకం చేశారు. అయితే పరీక్షల నోటిఫికేషన్ జారీ చేయకుండా నెలల తరబడి సాగదీశారు. చివరికి క్షేత్ర స్థాయిలో నిరుద్యోగుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. తాజాగా ఈనెల 20న చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆర్భాటంగా నోటిఫికేషన్‌ను మంత్రి లోకేష్ విడుదల చేశారు. కాగా సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామంటూ మెలిక పెట్టడంతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు.
నిధులను కాజేసేందుకేనా..
సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహించాలంటే అందుకు సరిపడే సౌకర్యాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కేంద్రాల్లో లేవు. ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ ఇంజినీరింగ్, మరికొన్ని కంప్యూటర్ కేంద్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రైవేట్ కేంద్రాల్లో సీబీటీ విధానంలో డీఎస్సీ పరీక్షల నిర్వహణకు రూ.కోట్ల కొద్ది బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. అదే పాత విధానంలో ఒకే రోజు డీఎస్సీ పరీక్షను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల కేంద్రాల్లో నిర్వహిస్తే ప్రభుత్వానికి తక్కువ ఖర్చుతో సరిపోయేది. అలా కాకుండా డీఎస్సీ పరీక్షను నెల రోజుల పాటు ఇంజినీరింగ్ కళాశాలల్లో నిర్వహించి నిధులను నొక్కేసేందుకు ప్రణాళిక రచించినట్లు విమర్శలున్నాయి.
మొక్కుబడిగా ఉచిత శిక్షణలు
డీఎస్సీ పరీక్షకు ఉచిత కోచింగ్ హామీ ప్రకారం నోటిఫికేషన్‌కు కనీసం అయిదు నెలల ముందు శిక్షణ ఇచ్చి ఉంటే నిరుద్యోగులకు ఉపయోగం ఉండేది. ఉచిత కోచింగ్ అంటూ ప్రచారం చేసిందే తప్ప శిక్షణ ఇచ్చిన పాపాన పోలేదు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ప్రారంభించినప్పటికీ 5 మంది అభ్యర్థులు కూడా లేరు. ఎస్సీ అభ్యర్థులకు ఇటీవలే శిక్షణ ప్రారంభించారు. శిక్షణ కేంద్రాల్లో నైపుణ్యం కలిగిన అధ్యాపకులు లేకపోవడంతో అభ్యర్థులు ఉచిత శిక్షణ పై నమ్మకం లేక ప్రైవేట్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఉచిత శిక్షణ లోనూ ప్రభుత్వం నిరుద్యోగులను మోసగించింది.
ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రకారం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పాఠశాలల్లో వివిధ కేడర్‌లలో 1,473 పోస్టులను భర్తీ చేయనున్నారు. అధికంగా ఎస్జీటీ పోస్టులు 979 పోస్టులను భర్తీ చేయనున్నారు. మిగిలిన స్కూల్ అసిస్టెంట్ కేడర్‌లో 499 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
దళితులను మోసగించింది
ఉచిత డీఎస్సీ శిక్షణ ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం దళితులను మోసగించింది. దూర ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి రొడ్డెక్కేలా చేసింది. ప్రణాళిక ప్రకారం ఎస్సీ నిరుద్యోగులకు ఇవ్వాల్సిన ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇప్పించడంలోప్రభుత్వం విఫలమైంది.
– నాగరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి
ఇబ్బంది పెట్టడం సరికాదు
డీఎస్సీ నిరుద్యోగులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం సరికాదు. ప్రమాణ స్వీకారం రోజున సంతకం చేశారు. నోటిఫికేషన్ ఇచ్చేందుకే పది నెలలకు పైగానే సమయం పట్టింది. అభ్యర్థులకు ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉచిత శిక్షణ సక్రమంగా ఇచ్చారా అంటే అదీ లేదు. – శివారెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ జాతీయ కార్యదర్శి
పరీక్షలు నెలరోజులా..
డీఎస్సీ పరీక్షను ఈసారి తొలిసారిగా సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని నోటిఫికేషన్‌లో తెలియజేశారు. సీబీటీ విధానం ప్రకారం పరీక్షలను నెల రోజుల పాటు నిర్వహించనున్నారు. గతంలో ఒక్క రోజులోనే డీఎస్సీ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేవారు. ఉద్ధేశపూర్వకంగా ఏదో ఒక మెలిక పెట్టాలనే ఇలా నిర్వహిస్తున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.

● బాబు జన్మదిన కానుకగా నోటిఫికేషన్ ● దళితులకు, బీసీలకు

● బాబు జన్మదిన కానుకగా నోటిఫికేషన్ ● దళితులకు, బీసీలకు