
ఫ్యామిలీ ఫిజిషియన్ ద్వారా ప్రజలకు చికిత్స అందిస్తున్న వైద్యులు
● జిల్లాలో విజయవంతంగా ‘ఫ్యామిలీ డాక్టర్’ ● పల్లె బాట పట్టిన వైద్యులు ● మంచానికి పరిమితమైన వారికి ఇంటి వద్దే చికిత్స ● ఉచితంగా పరీక్షలు.. మందులు ● విశిష్ట కార్యక్రమంపై గ్రామీణుల హర్షం
దశాబ్దాలుగా పల్లె సీమలు చిన్నచూపునకు గురయ్యాయి. కనీస వైద్యసేవలకు సైతం దూరంగా నిలిచిపోయాయి. రోగం వస్తే పట్టణాలకు పరుగులు తీయాల్సిన దుస్థితిలో ఏళ్లు గడచిపోయాయి. ఈ క్రమంలో
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణులకు మంచి రోజులు వచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేవపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ఇంటి ముంగిటకే వైద్యసేవలు
అందుబాటులోకి వచ్చాయి. ప్రతి నెలా రెండు పర్యాయాలు డాక్టర్లే పల్లెకు వచ్చి
చికిత్సలందిస్తున్నారు. వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు
పంపిణీ చేస్తున్నారు. దీనిపై పల్లెవాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
వ్యయప్రయాసలు తప్పాయని సంతోషంగా వెల్లడిస్తున్నారు.
జనరల్ ఓపీ 12,972
ఏఎన్‌సీ 8,037
పీఎన్‌సీ 2,114
అనీమియా 755
హైపర్‌టెన్షన్ 17,679
డయాబెటిస్ 14,848
డయాబెటిస్, హైపర్‌టెన్షన్ 20,595
ఓరల్ క్యాన్సర్ 178
బ్రెస్ట్ క్యాన్సర్ 22
సర్వైకల్ క్యాన్సర్ 100
టీబీ 88
చిత్తూరు రూరల్ : పల్లెల్లోని పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం అభయమిచ్చింది. వైద్యసేవల్లో నూతన విధానాలను తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం సక్రమంగా వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సమర్థంగా అమలు చేసి చూపించింది. జిల్లాలో 2022 అక్టోబర్ 21 నుంచి ట్రయల్ రన్‌తో అమలవుతున్న ఈ కొత్త విధానంతో లక్షలాది మంది ఉచితంగా వైద్యం పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచానికే పరిమితమైన రోగుల ఇంటికే నేరుగా ప్రభుత్వ వైద్యుడే వెళ్లి వారి ఆరోగ్య స్థితిగతులను పరిశీలిస్తుండడంతో ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోంది. అలాగే వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్నవారికి మొబైల్ మెడికల్ యూనిట్ 104 వాహనాల ద్వారా ఓపీ వైద్యంతోపాటు పరీక్షలు, మందులు ఇచ్చే ప్రక్రియ కూడా ఈ విధానానికి తోడు కావడం మరింత ప్రశంసలు తీసుకువస్తోంది.
పకడ్బందీగా ప్రక్రియ
జిల్లాలోని 50 పీహెచ్‌సీలకు సంబంధించి 464 విలేజ్ హెల్త్ క్లినిక్స్ పరిధిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలవుతోంది. ఇందుకోసం మొత్తం 44 ఎంఎంయూ 104 వాహనాలను వినియోగిస్తున్నారు. ప్రతి నెలా రెండు రోజులు గ్రామాల్లో ఈ విధానం అమలయ్యేలా షెడ్యూలును ఉన్నతాధికారులు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. జిల్లాలో 102 మెడికల్ ఆఫీసర్లు పూర్తి స్థాయిలో విధుల్లో ఉన్నారు. ఇలాగే 104 వాహనం వద్ద ఓపీ వద్ద 14 రకాల పరీక్షలతో పాటు 67 రకాల మందులు అందుబాటులో ఉంచుతున్నారు.
