వర్క్ ఫ్రమ్ హోమ్‌పై జోహో ప్రకటన | Zoho CEO Sridhar Vembu Rethinks Work from Office After PM Modi Energy Saving Call | Sakshi
Sakshi News home page

వర్క్ ఫ్రమ్ హోమ్‌పై జోహో ప్రకటన

May 13 2026 11:43 AM | Updated on May 13 2026 12:03 PM

Zoho CEO Sridhar Vembu Rethinks Work from Office After PM Modi Energy Saving Call

కొవిడ్‌ పరిణామాల తర్వాత ఐటీ ఉద్యోగులు తిరిగి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బాట పట్టిన తరుణంలో జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు చేసిన తాజా వ్యాఖ్యలు కార్పొరేట్ ప్రపంచంలో చర్చకు తెరలేపాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపును గౌరవిస్తూ తమ సంస్థలో తిరిగి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయడాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

ప్రధాని పిలుపు

దేశం ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, పౌరులు, సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రధాని మోదీ ఇటీవల విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన శ్రీధర్ వెంబు, నేషన్ ఫస్ట్ అనే గ్రాఫిక్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. అందులో మోదీ తెలిపిన వివరాల ప్రకారం.. అనవసర ప్రయాణాలను తగ్గించడం ద్వారా పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలి. సాధ్యమైనంత వరకు ఇంటి నుంచే పని చేయడాన్ని ప్రోత్సహించాలి. విదేశీ ప్రయాణాలు, వంట నూనె వినియోగం, బంగారం కొనుగోళ్లపై నియంత్రణ అనే అంశాలున్నాయి.

‘ఒక సంస్థగా మేము ఇటీవలి కాలంలో పూర్తిస్థాయిలో కార్యాలయం నుంచి పనిచేసే విధానానికి మారాం. అయితే, ప్రధాని విజ్ఞప్తి నేపథ్యంలో మేము మా నిర్ణయాన్ని పునసమీక్షించుకోబోతున్నాం’ అని వెంబు స్పష్టం చేశారు.

ఆచరణలో జోహో

శ్రీధర్ వెంబు తన పోస్ట్‌లో జోహో ఇప్పటికే అంతర్గతంగా తీసుకుంటున్న మార్పులను కూడా వివరించారు. ‘సంస్థకు చెందిన పొలాల్లో సహజ సిద్ధమైన సాగు పద్ధతులను అవలంబిస్తున్నాం. డీజిల్ వినియోగాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గించే మార్గాలను అన్వేషిస్తున్నాం’ అని చెప్పారు. ఈ పోస్ట్ కొద్ది గంటల్లోనే వైరల్‌ అయింది.

శ్రీధర్ వెంబు ప్రతిపాదన కేవలం ఒక కంపెనీ నిర్ణయంగా చూడలేమని, అది దేశ ఆర్థిక వ్యవస్థపై ఇంధన భారాన్ని తగ్గించే ఒక వ్యూహాత్మక అడుగు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ మరిన్ని ఐటీ దిగ్గజాలు ఇదే బాటలో నడిస్తే భారత విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. అయితే, దీనివల్ల ప్రభావితమయ్యే అసంఘటిత రంగ కార్మికులకు సరైన పరిష్కారం అందించాలి.

ఇదీ చదవండి: బంగారం షాక్‌.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement