
ప్రమోటర్ గ్రూప్ వాటా పెంపునకు నో
న్యూఢిల్లీ: మీడియా రంగ దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్(జీల్)లో ప్రమోటర్ల వాటా పెంపు ప్రతిపాదనను తాజాగా వాటాదారులు తిరస్కరించారు. పూర్తిస్థాయిలో మార్పిడి చేసుకునే వారంట్ల జారీ ద్వారా ప్రమోటర్ గ్రూప్ సంస్థలు జీల్‌లో రూ. 2,237 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసేందుకు ప్రతిపాదించాయి. దీంతో ప్రిఫరెన్షియల్ పద్ధతిలో కంపెనీలో వాటాను 18.4 శాతానికి పెంచుకునేందుకు ప్రతిపాదించాయి. అయితే ఇందుకు వాటాదారులు అనుమతించనట్లు కంపెనీ తెలియజేసింది. ప్రత్యేక రిజల్యూషన్ ద్వారా చేపట్టిన ప్రతిపాదనకు 59.51 శాతం వాటాదారులు అనుకూలత వ్యక్తం చేసినప్పటికీ 40.48 శాతం వ్యతిరేకించినట్లు వెల్లడించింది. ప్రత్యేక రిజల్యూషన్ చేపడితే కనీసం 75 శాతంమంది వాటాదారుల నుంచి అనుమతి పొందవలసి ఉంటుందని వివరించింది.
గత నెలలో ప్రతిపాదన
గత నెలలో జీల్ ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు వారంట్ల జారీ ద్వారా రూ. 2,237.44 కోట్ల సమీకరణ ప్రణాళికలు ప్రకటించింది. తద్వారా ప్రమోటర్ల వాటా 18.4 శాతానికి బలపడే వీలుంది. ఇందుకు అనుగుణంగా కంపెనీ బోర్డు పూర్తిగా మార్పిడికి వీలయ్యే 16.95 కోట్ల వారంట్ల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. ప్రిఫరెన్షియల్ పద్ధతిలో ఆలి్టలిస్ టెక్నాలజీస్, సన్‌బ్రైట్ మారిషస్ ఇన్వెస్ట్‌మెంట్స్ తదితర ప్రమోటర్ సంస్థలకు వారంట్లను జారీ చేసేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. కాగా.. కంపెనీలో అతిపెద్ద వాటాదారు సంస్థ నార్జెస్ బ్యాంక్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ జీల్ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రాక్సీ అడ్వయిజరీ సంస్థ గ్లాస్ లెవిస్ సైతం సానుకూలంగా ఓటు చేయమని వాటాదారులకు సూచించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ప్రమోటర్ల వాటా పెంపునకు వాటాదారుల తిరస్కరణ వార్తలతో జీల్ షేరు బీఎస్‌ఈలో 3.2 శాతం క్షీణించి రూ. 137 వద్ద ముగిసింది.