breaking news
Promoters shares
-
మల్టిపుల్స్ చేతికి వీఐపీ
న్యూఢిల్లీ: లగేజీ, ప్రయాణ సంబంధ వస్తువుల తయారీ దిగ్గజం వీఐపీ ఇండస్ట్రీస్‌లో ప్రమోటర్లు ప్రధాన వాటా విక్రయించనున్నారు. దిలీప్ పిరమల్, కుటుంబ సభ్యులు 32 శాతంవరకూ వాటాను ఆల్టర్నేట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మల్టిపుల్స్‌కు అమ్మివేసేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ అంశాన్ని రెండు సంస్థలు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. దీంతో వీఐపీ ఇండస్ట్రీస్ వాటాదారులకు సెబీ నిబంధనల ప్రకారం మల్టిపుల్స్ కన్సార్షియం ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. పబ్లిక్ వాటాదారుల నుంచి 26 శాతం వాటా(3.7 కోట్ల షేర్లు) కొనుగోలుకి షేరుకి రూ. 388 ధరలో ఆఫర్‌ను ప్రకటించింది. ఇందుకు వాటాదారులు పూర్తిస్థాయిలో స్పందిస్తే రూ. 1,438 కోట్లవరకూ మల్టిపుల్స్ ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. కాగా.. ఓపెన్ ఆఫర్ శుక్రవారం ముగింపు ధర రూ. 456తో పోలిస్తే 15 శాతం తక్కువకావడం గమనార్హం! గత ఏడాది కాలంలో కంపెనీ షేరు 2024 సెపె్టంబర్ 24న రూ. 590 వద్ద గరిష్టాన్ని తాకగా.. 2025 ఏప్రిల్ 7న రూ. 249 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. 2025 మార్చికల్లా ప్రమోటర్లు, ప్రమోటర్ సంస్థ 51.73 శాతం వాటాను కలిగి ఉన్నాయి. వాటా కొనుగోలుకి సెబీ, సీసీఐ అనుమతులు లభించవలసి ఉంది. ఈ లావాదేవీ తదుపరి కంపెనీ నియంత్రణ మల్టిపుల్స్ పీఈకి బదిలీ కానుంది. దిలీప్ పిరమల్, కుటుంబ సభ్యులు వాటాదారులుగా కొనసాగనున్నారు. దిలీప్ పిరమల్ కంపెనీకి చైర్మన్ ఎమిరిటస్‌గా వ్యవహరించనున్న ట్లు వీఐపీ ఇండస్ట్రీస్ పేర్కొంది. మల్టిపుల్స్ పీఈ ఫండ్స్‌తోపాటు.. సమ్విభాగ్ సెక్యూరిటీస్, మిథున్ పాదమ్ సాచేటి, సిద్ధార్థ సాచేటి, ప్రాఫిటెక్స్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ కన్సార్షియం వీఐపీ ఇండస్ట్రీస్‌ను సొంతం చేసుకోనుంది. ఆహ్వానిస్తున్నాం.. కంపెనీలో వ్యూహాత్మక భాగస్వామికానున్న మల్టిపుల్స్ కన్సార్షియంకు ఆహ్వానం పలుకుతున్నట్లు వీఐపీ చైర్మన్ దిలీప్ పిరమల్ పేర్కొన్నారు. కంపెనీకున్న పటిష్ట బ్రాండ్ విలువ పునరుద్ధరణలో ఇది కీలక ముందడుగుగా వ్యాఖ్యానించారు. దీంతో ఇటీవల కొన్నేళ్లుగా సవాళ్లు ఎదుర్కొంటున్న కంపెనీ దేశీ లగేజీ మార్కెట్లో తిరిగి బలపడనున్నట్లు అభిప్రాయపడ్డారు. అత్యంత పటిష్ట కార్యకలాపాలు కలిగిన వీఐపీ యాజమాన్య మారి్పడిపై ఉద్వేగంగా ఉన్నట్లు మల్టిపుల్స్ ఆల్టర్నేట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వ్యవస్థాపకుడు, ఎండీ, సీఈవో రేణుకా రామ్‌నాథ్ వ్యాఖ్యానించారు. కంపెనీ బ్రాండు విలువను మరింత పెంచడంతోపాటు.. తదుపరి దశ వృద్ధికి కృషి చేయనున్నట్లు తెలియజేశారు. వీఐపీ సంగతిదీ.. ముంబై కేంద్రంగా 1971లో ఏర్పాటైన వీఐపీ ఇండస్ట్రీస్ లగేజీ తయారీకి ప్రపంచంలోనే రెండో పెద్ద కంపెనీగా నిలు స్తోంది. ఆసియాలోకెల్లా అతి పెద్ద కంపెనీకాగా.. శామ్సోనైట్, సఫారీ ఇండస్ట్రీస్‌తో దేశీయంగా పోటీ పడుతోంది. వీఐపీ ఇండస్ట్రీస్ మార్కెట్ విలు వ రూ. 6,482 కోట్లుకాగా.. అరిస్ట్రోకాట్, వీఐపీ, కార్ల్టన్, స్కైబ్యాగ్స్, క్యాప్రీస్ బ్రాండ్లను కలిగి ఉంది. 2024కల్లా బ్రాండెడ్ లగేజీ మార్కెట్లో 50 శాతం మార్కెట్ వాటాను పొందింది. అయితే ప్రత్యర్థి కంపెనీలతో పోటీ పెరగడంతో మార్కెట్ వాటాను కోల్పోతూ వస్తోంది. గతేడాది (2024–25) వీఐపీ ఇండస్ట్రీస్ ఆదా యం రూ. 2,170 కోట్లకు చేరింది. ఈ వార్తల నేపథ్యంలో వీఐపీ ఇండస్ట్రీస్ షేరు బీఎస్ఈలో 6 శాతం జంప్‌చేసి రూ. 482 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 487–431 మధ్య ఊగిసలాడింది. -
జీ ప్రమోటర్లకు వాటాదారుల చెక్
న్యూఢిల్లీ: మీడియా రంగ దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్)లో ప్రమోటర్ల వాటా పెంపు ప్రతిపాదనను తాజాగా వాటాదారులు తిరస్కరించారు. పూర్తిస్థాయిలో మార్పిడి చేసుకునే వారంట్ల జారీ ద్వారా ప్రమోటర్ గ్రూప్ సంస్థలు జీల్లో రూ. 2,237 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసేందుకు ప్రతిపాదించాయి. దీంతో ప్రిఫరెన్షియల్ పద్ధతిలో కంపెనీలో వాటాను 18.4 శాతానికి పెంచుకునేందుకు ప్రతిపాదించాయి. అయితే ఇందుకు వాటాదారులు అనుమతించనట్లు కంపెనీ తెలియజేసింది. ప్రత్యేక రిజల్యూషన్ ద్వారా చేపట్టిన ప్రతిపాదనకు 59.51 శాతం వాటాదారులు అనుకూలత వ్యక్తం చేసినప్పటికీ 40.48 శాతం వ్యతిరేకించినట్లు వెల్లడించింది. ప్రత్యేక రిజల్యూషన్ చేపడితే కనీసం 75 శాతంమంది వాటాదారుల నుంచి అనుమతి పొందవలసి ఉంటుందని వివరించింది. గత నెలలో ప్రతిపాదన గత నెలలో జీల్ ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు వారంట్ల జారీ ద్వారా రూ. 2,237.44 కోట్ల సమీకరణ ప్రణాళికలు ప్రకటించింది. తద్వారా ప్రమోటర్ల వాటా 18.4 శాతానికి బలపడే వీలుంది. ఇందుకు అనుగుణంగా కంపెనీ బోర్డు పూర్తిగా మార్పిడికి వీలయ్యే 16.95 కోట్ల వారంట్ల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. ప్రిఫరెన్షియల్ పద్ధతిలో ఆలి్టలిస్ టెక్నాలజీస్, సన్‌బ్రైట్ మారిషస్ ఇన్వెస్ట్మెంట్స్ తదితర ప్రమోటర్ సంస్థలకు వారంట్లను జారీ చేసేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. కాగా.. కంపెనీలో అతిపెద్ద వాటాదారు సంస్థ నార్జెస్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ జీల్ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రాక్సీ అడ్వయిజరీ సంస్థ గ్లాస్ లెవిస్ సైతం సానుకూలంగా ఓటు చేయమని వాటాదారులకు సూచించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.ప్రమోటర్ల వాటా పెంపునకు వాటాదారుల తిరస్కరణ వార్తలతో జీల్ షేరు బీఎస్ఈలో 3.2 శాతం క్షీణించి రూ. 137 వద్ద ముగిసింది. -
విప్రోలో మళ్లీ చేతులు మారిన ప్రమోటర్ల వాటాలు
ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఐటీ దిగ్గజం విప్రో ప్రమోటర్ల వాటాలో 1.72 శాతం చేతులు మారింది. స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సమాచారం ప్రకారం 1.72 శాతం వాటాకు సమానమైన 18.05 కోట్ల ఈక్విటీ షేర్లను అజీమ్ ప్రేమ్‌జీ ట్రస్ట్ విక్రయించింది. వీటిని షేరుకి రూ. 259 సగటు ధరలో ప్రమోటర్ గ్రూప్‌నకు చెందిన ప్రజీమ్ ట్రేడర్స్, జాష్ ట్రేడర్స్ కొనుగోలు చేశాయి.డీల్ విలువ రూ. 4,675 కోట్లుకాగా.. సోమవారం(9న) సైతం అజీమ్ ప్రేమ్‌జీ ట్రస్ట్ 1.93 శాతం వాటాకు సమానమైన 20.23 కోట్ల షేర్లను విక్రయించిన సంగతి తెలిసిందే. వీటిని షేరుకి రూ. 250 సగటు ధరలో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు చెందిన ప్రజీమ్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, హర్షమ్ ట్రేడర్స్ అండ్ ప్రజీమ్ ట్రేడర్స్ కొనుగోలు చేశాయి.డీల్ విలువ రూ. 5,057 కోట్లుకాగా.. గతేడాది నవంబర్‌లో ప్రజీమ్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ద్వారా ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ 1.6 శాతం వాటాకు సమానమైన 8.49 కోట్ల విప్రో షేర్లను కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 4,757 కోట్లు వెచ్చించింది. అయితే వీటిని ప్రజీమ్, జాష్ ట్రేడర్స్ వీటిని విక్రయించడం గమనార్హం! -
ఈడీ అదుపులో జెన్సోల్ ప్రమోటర్!
న్యూఢిల్లీ: జెన్సోల్ కంపెనీ ప్రమోటర్ల నిధుల మళ్లింపు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఢిల్లీ, గురుగ్రామ్, అహ్మదాబాద్‌లోని కంపెనీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా)లోని నిబంధనల కింద ఈ సోదాలు చేపట్టింది. ఢిల్లీలోని ఓ హోటల్లో ఉన్న కంపెనీ సహ ప్రమోటర్ పునీత్ సింగ్ జగ్గీని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. మరో ప్రమోటర్ అన్మోల్ సింగ్ జగ్గీ దుబాయ్‌ల్లో ఉన్నట్టు సమాచారం. ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీ కంపెనీ ఖాతాల నుంచి నిధులు మళ్లించారంటూ సెబీ దర్యాప్తులో తేలడం తెలిసిందే. ఇరెడా, పీఎఫ్సీ నుంచి ఈవీలు, ఈపీసీ కాంట్రాక్టుల కోసం తీసుకున్న రుణాలను ప్రమోటర్లు మళ్లించి ఆస్తులు కొనుగోలు చేసినట్టు సెబీ గుర్తించింది. దీంతో ఈ వ్యవహారంపై ఈడీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. -
మోతీలాల్ ఓస్వాల్ ప్రమోటర్ల దాతృత్వం
న్యూఢిల్లీ: మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రమోటర్లు సమాజ సేవ కోసం 10 శాతం వాటాలను విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. మోతీలాల్ ఓస్వాల్ ప్రమోటింగ్ కంపెనీ మోతీలాల్ ఓస్వాల్, ప్రమోటర్ రామ్‌దేవ్ అగర్వాల్ చెరో ఐదు శాతం (చెరో 73,97,556 షేర్లు) చొప్పున కంపెనీ ఈక్విటీలో వాటాలను విరాళంగా ఇవ్వనున్నట్టు కంపెనీ ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం నాటికి కంపెనీ మార్కెట్ విలువ రూ.12,161 కోట్లు కాగా, ఈ ప్రకారం 10 శాతం వాటాల విలువ రూ.1,216 కోట్లుగా ఉండనుంది. ఈ మొత్తాన్ని వచ్చే పదేళ్లలోపు లేదా అంతకంటే ముందుగానే ఖర్చు చేయనున్నట్టు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం ఇచి్చంది. ఇప్పటికే మన దేశం నుంచి విప్రోప్రేమ్‌జీ, గౌతమ్ అదానీ, శివ్‌నాడార్, నందన్ నీలేకని తదితరులు సమాజం కోసం పెద్ద మొత్తంలో విరాళలను ప్రకటించగా, వారి సరసన మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ ప్రమోటర్లు కూడా చేరినట్టయింది. మరోవైపు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ తన నిర్వహణలోని బ్రోకింగ్, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాన్ని గ్లైడ్ టెక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీకి విక్రయించేందుకు నిర్ణయించడం గమనార్హం. గ్లైడ్ టెక్ అనేది మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్‌కు పూర్తి అనుబంధ సంస్థగా ఉంది. అలాగే అనుబంధ సంస్థ కింద ఉన్న సంపద నిర్వహణ వ్యాపారాన్ని మాతృసంస్థ మోతీలాల్ ఓస్వా ల్ ఫైనాన్షియల్‌కు మార్చేందుకు నిర్ణయించింది. -
బంధన్ బ్యాంక్‌కు వాటా విక్రయ షాక్
ప్రయివేట్ రంగ సంస్థ బంధన్ బ్యాంక్ కౌంటర్లో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 11.3 శాతం కుప్పకూలి రూ. 306 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 295 వరకూ జారింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం బంధన్ బ్యాంకులో ప్రమోటర్లు 20 శాతం వాటా విక్రయించే సన్నాహాల్లో ఉన్నట్లు బ్యాంకింగ్ వర్గాలు వారాంతాన పేర్కొన్నాయి. బ్లాక్‌డీల్ ద్వారా 20.9 శాతం వాటాను నేటి ట్రేడింగ్‌లో విక్రయానికి ఉంచినట్లు తెలుస్తోంది. బ్లాక్‌డీల్ విలువ రూ. 10,500 కోట్లుకాగా.. ఇందుకు ఫ్లోర్ ధర రూ. 311.10గా నిర్ణయించినట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి. ఇది శుక్రవారం ముగింపు రూ. 345తో పోలిస్తే 10 శాతం డిస్కౌంట్‌కావడం గమనార్హం! భారీ ట్రేడింగ్ బీఎస్ఈ, ఎన్ఎస్ఈల ద్వారా రూ. 314 సగటు ధరలో బంధన్ బ్యాంక్‌కు చెందిన 33 కోట్ల షేర్లు తొలుత బ్లాక్‌డీల్స్ ద్వారా చేతులు మారినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇవి బ్యాంకు ఈక్విటీలో 20.6 శాతం వాటాకు సమానమని తెలియజేశారు. వెరసి ట్రేడింగ్ ప్రారంభమైన 60 నిముషాల్లోనే బంధన్ బ్యాంక్ కౌంటర్లో 37 కోట్ల షేర్లు ట్రేడైనట్లు తెలుస్తోంది. ఈ కౌంటర్లో గత రెండు వారాల సగటు ట్రేడింగ్ పరిమాణం 7.47 లక్షల షేర్లు మాత్రమే! కారణమేవిటంటే? ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రమోటర్లు మూడేళ్లలోగా బ్యాంకులో తమ వాటాను 40 శాతానికి పరిమితం చేసుకోవలసి ఉంటుంది. జూన్ చివరికల్లా బంధన్ బ్యాంకులో ప్రమోటర్లు 60.95 శాతం వాటాను కలిగి ఉన్నారు. కొత్త బ్యాంకింగ్ లైన్సింగ్ విధానాల రీత్యా బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభమైన మూడేళ్లలోగా ప్రమోటర్ల వాటా 40 శాతానికి కుదించుకోవలసి ఉంటుందని నిపుణులు వివరించారు. దీంతో బంధన్ బ్యాంక్ ప్రమోటర్లు వాటా విక్రయం కోసం క్రెడిట్ స్వీస్ సెక్యూరిటీస్, జేపీ మోర్గాన్ ఇండియా, గోల్డ్‌మన్ శాక్స్ ఇండియా సెక్యూరిటీస్ తదితరాలను బుక్‌రన్నర్స్‌గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. -
ఆర్ఐఎల్లో 12ఏళ్ల గరిష్టానికి ముకేశ్ వాటా
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ వాటా 12ఏళ్ల గరిష్ట స్థాయి 49.14శాతానికి చేరుకుంది. ఇటీవల ఆర్ఐల్ జారీ చేసిన రైట్స్ ఇష్యూలో భాగంగా ముకేశ్ కొన్ని షేర్లను సొంతం చేసుకోవడంతో కంపెనీలో వాటా పెరిగింది. ఆర్ఐఎల్కు చెందిన రూ.53,124 కోట్ల రైట్స్ ఇష్యూలో ముకేశ్ అంబానీ, ఇతర ప్రమోటర్ గ్రూప్ సభ్యులు కలిపి రూ.28,286 కోట్లు వెచ్చించి 2.25 కోట్ల షేర్లను దక్కించుకున్నారు. కంపెనీలో జూన్ 2008 నాటికి ప్రమోటర్ల వాటా 51.37 శాతంగా ఉండేది. అది 2011 సెప్టెంబర్ నాటికి 44.71శాతానికి దిగివచ్చింది. అప్పటి నుంచి ప్రమోటర్లు వివిధ రూపాల్లో క్రమంగా కంపెనీలో వాటాలను పెంచుకుంటున్నారు. రైట్స్ ఇష్యూలో భాగంగా అన్సబ్స్క్రైబ్డ్ పోర్షన్లో ప్రమోటర్ గ్రూప్ దాదాపు 50శాతం అదనపు వాటాను సొంతం చేసుకున్నట్లు రెగ్యూలేటరీ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల్లో ఒక ప్రమోటర్ తన కంపెనీలో వాటాను పెంచుకోవడం, భారీ ఎత్తున నిధులను సమీకరించడటం లాంటి అంశాలు సంస్థ భవిష్యత్తు వృద్ధిపై ప్రమోటర్ నిబద్ధతను చాటి చెబుతాయి. అలాగే ఇన్వెస్టర్లలో మరింత విశ్వాసాన్ని పెంచుతాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఛైర్మన్ రామ్‌దియో అగర్వాల్ తెలిపారు. ఈ ఏడాది మార్చి 24న సూచీలు ఏడాది కనిష్టాన్ని తాకిన నాటి నుంచి శుక్రవారం వరకు రిలయన్స్ షేరు 82శాతం లాభపడింది. కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.10.07లక్షల కోట్లుగా ఉంది. గురువారం ఆర్ఐల్ పాక్షిక పెయిడ్-అప్ రైట్స్ ఇష్యూ షేర్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసింది. రైట్స్ ఇష్యూలో ముకేశ్‌కు 5.52లక్షల షేర్లు: రైట్స్ ఇష్యూలో భాగంగా కంపెనీ అధిపతి ముకేశ్ అంబానీ 5.52లక్షల ఈక్విటీ షేర్లను సొంతం చేసుకున్నారు. ఈ షేర్ల కొనుగోలుతో ముకేష్ అంబానీకి వ్యక్తిగతంగా రిలయన్స్‌లో మొత్తం ఈక్విటీ షేర్ల సంఖ్య 80.52లక్షలకు చేరుకుంది. రైట్స్ ఇష్యూకు ముందు 75 లక్షల ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇష్యూలో ముకేశ్ భార్య నీతా అంబానీ, పిల్లలు ఇషా, ఆకాశ్, అనంత్‌లు సైతం ఒక్కొక్కరు 5.52లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. -
తనఖా బాటలో ప్రమోటర్ల వాటాలు..
* 46 శాతం పైగా షేర్లు తనఖాలోనే * వీటి విలువ రూ. 2 లక్షల కోట్ల పైమాటే.. ముంబై: ఓవైపు స్టాక్స్ ధరలు అంతకంతకూ పతనమవుతుండగా.. మరోవైపు కంపెనీల ప్రమోటర్ల షేర్ల తనఖా మరింతగా పెరుగుతోంది. దాదాపు 517 కంపెనీల ప్రమోటర్ల వాటాల్లో సుమారు 46.35 శాతం షేర్లు తనఖాలోనే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పటి తర్వాత ఇది అత్యధిక స్థాయి కావడం గమనార్హం. ప్రైమ్ డేటాబేస్ గణాంకాల ప్రకారం గతేడాది ఆఖరు త్రైమాసికంలో ప్రమోటర్ల వాటాల తనఖా 14 శాతం పెరిగింది. ఇలా కుదవ పెట్టిన షేర్ల విలువ సెప్టెంబర్ త్రైమాసికం ఆఖరులో రూ. 1.78 లక్షల కోట్లుగా ఉండగా.. డిసెంబర్ త్రైమాసికంలో ఏకంగా రూ. 2.03 లక్షల కోట్లకు చేరింది. కుదవ పెట్టేందుకు మరిన్ని షేర్లు లేక.. అలాగని తీసుకున్న రుణాన్ని చెల్లించేసేంతగా నిధులూ లేక ప్రమోటర్లు చేతులెత్తేస్తే తలెత్తే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని పరి శీలకులు చెబుతున్నారు. షేరు భారీగా పతనం కావడంతో పాటు కంపెనీ యాజమాన్యమే మారిపోయే అవకాశాలు ఉండటంతో తాజా పరిస్థితి ఆయా సంస్థల ఇన్వెస్టర్లను కలవరపరుస్తోంది. వంద శాతమూ ఉన్నాయి.. సుమారు పాతిక కంపెనీల ప్రమోటర్లు నూటికి నూరు శాతం వాటాలను తనఖా పెట్టేశారు. బజాజ్ హిందుస్తాన్ షుగర్, గోకల్దాస్ ఎక్స్‌పోర్ట్స్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్, ఎస్ఈఎల్ మాన్యుఫాక్చరింగ్, సుబెక్స్, స్పెంటెక్స్ ఇండస్ట్రీస్, పిపావవ్ డిఫెన్స్ అండ్ ఆఫ్‌షోర్ ఇంజనీరింగ్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. ఇక దాదాపు 80 కంపెనీల్లో ప్రమోటర్లు తమ వాటాల్లో 90 శాతాన్ని, సుమారు 200 పైగా సంస్థల ప్రమోటర్లు 50 శాతం వాటాలను తనఖాలో ఉంచారు. తనఖాలో ఉంచిన షేర్ల విలువపరంగా చూస్తే అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, కెయిర్న్ ఇండియా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్సార్ ఆయిల్ సంస్థలు టాప్‌లో ఉన్నాయి. ఇవి తనఖా ఉంచిన షేర్ల విలువ రూ. 40,000 కోట్ల పైమాటే. డిసెంబర్ త్రైమాసికంలో 82 సంస్థల ప్రమోటర్ల షేర్ల తనఖా గణనీయంగా పెరిగింది. అయితే, తనఖాలో ఉన్న షేర్లను విడిపించుకుంటున్న ప్రమోటర్లూ ఉన్నారు. మంగళం సిమెంటు, ఆశాపురా మైన్‌కెమ్, సెంచరీ ఎంకా మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. తనఖా ఎందుకు.. కార్యకలాపాల విస్తరణకు, కంపెనీ ఎదుగుదలకు, ఇతర ప్రాజెక్టులకు నిధులు సమీకరించుకునేందుకు, కంపెనీ నిర్వహణా నిధుల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం ప్రమోటర్లు షేర్లను తనఖా పెట్టడం సర్వసాధారణమే. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు) షేర్ల విలువలో దాదాపు 50 శాతం దాకా రుణాలు ఇస్తుంటాయి. దీంతో ఎక్కువగా ప్రమోటర్లు వాటివైపు మొగ్గుచూపుతుంటారు. అలాగే మిగతా మార్గాలతో పోలిస్తే తనఖా ద్వారా రుణాలు కాస్త చౌకగా లభించే అవకాశాలుండటం కూడా ప్రమోటర్లు ఇటువైపు మళ్లడానికి కారణం. పరిణామాలేంటి.. ప్రమోటర్ల వాటాలు భారీ స్థాయిలో తనఖాలో ఉండటం ఇన్వెస్టర్లకు అంత శ్రేయస్కరం కాదని మార్కెట్ పరిశీలకుల విశ్లేషణ. ప్రమోటర్లు తమ వాటాల్లో 50 శాతం పైగా షేర్లను తనఖా పెట్టినప్పుడో.. లేదా కంపెనీ మొత్తం ఈక్విటీ క్యాపిటల్‌లో 20 శాతం పైగా షేర్లు తనఖాలో ఉన్నప్పుడో సమస్య తలెత్తుతుంది. షేరు ధర నిర్దిష్ట స్థాయికి మించి పతనమైతే ప్రమోటర్లు.. మార్జిన్‌ను కొనసాగించేందుకు మరిన్ని షేర్లు తనఖా పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ అందుకు తగినన్ని షేర్లు ప్రమోటర్లు పెట్టలేకపోయినా, తీసుకున్న అప్పును తిరిగి చెల్లించేంతగా నిధులు వారి వద్ద లేకపోయినా.. రుణమిచ్చిన సంస్థలు తక్షణం చర్యలకు ఉపక్రమిస్తాయి. తనఖా పెట్టిన షేర్లను అమ్మేసుకుని డబ్బు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తాయి. దీంతో స్టాక్ ధర మరింతగా పతనమవుతుంది. ఫలితంగా ఇన్వెస్టర్లకు మరిన్ని నష్టాలూ రావొచ్చు. ప్రమోటర్లు తీసుకున్న రుణాలను చెల్లించలేకపోయినప్పుడు రుణదాతలు ఇలా తమ దగ్గరున్న షేర్లను అమ్మేసిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. -
జీఎంఆర్ ఇన్ఫ్రా ప్రమోటర్ల వాటాలు తనఖా
న్యూఢిల్లీ: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రమోట్ చేస్తున్న కంపెనీల్లో మూడు సంస్థలు తమ వాటాలను ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రస్ట్ కంపెనీ, ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్‌కు తనఖా పెట్టాయి. జీఎంఆర్ హోల్డింగ్స్, జీఎంఆర్ బిజినెస్ అండ్ కన్సల్టెన్సీ, జీఎంఆర్ ఎంటర్ప్రైజెస్ కలిసి మొత్తం 19.13 శాతం వాటాలను తనఖా ఉంచాయి. జీఎంఆర్ ఇన్ఫ్రా మాతృసంస్థ జీఎంఆర్ హోల్డింగ్స్ ఏప్రిల్ 28, 30న రెండు విడతలుగా 5.23 శాతం వాటాలను, జీఎంఆర్ ఎంటర్ప్రైజెస్ సైతం 0.38 శాతం వాటాలను ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ వద్ద తనఖా ఉంచాయి. అలాగే జీఎంఆర్ బిజినెస్ అండ్ కన్సల్టెన్సీ 13.52 శాతం వాటాలను రెండు లావాదేవీల్లో ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్, ఐఎల్‌ఎఫ్‌ఎల్ ట్రస్ట్ కంపెనీ వద్ద తనఖా ఉంచాయి. మంగళవారం బీఎస్ఈలో జీఎంఆర్ ఇన్ఫ్రా షేరు ధర 2.82 శాతం క్షీణించి రూ. 15.48 వద్ద ముగిసింది.