
ప్రమోటర్ల వాటాలో 32 శాతం విక్రయం
షేరుకి రూ. 388 ధరలో ఓపెన్ ఆఫర్
న్యూఢిల్లీ: లగేజీ, ప్రయాణ సంబంధ వస్తువుల తయారీ దిగ్గజం వీఐపీ ఇండస్ట్రీస్‌లో ప్రమోటర్లు ప్రధాన వాటా విక్రయించనున్నారు. దిలీప్ పిరమల్, కుటుంబ సభ్యులు 32 శాతంవరకూ వాటాను ఆల్టర్నేట్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ మల్టిపుల్స్‌కు అమ్మివేసేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ అంశాన్ని రెండు సంస్థలు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. దీంతో వీఐపీ ఇండస్ట్రీస్ వాటాదారులకు సెబీ నిబంధనల ప్రకారం మల్టిపుల్స్ కన్సార్షియం ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. పబ్లిక్ వాటాదారుల నుంచి 26 శాతం వాటా(3.7 కోట్ల షేర్లు) కొనుగోలుకి షేరుకి రూ. 388 ధరలో ఆఫర్‌ను ప్రకటించింది.
ఇందుకు వాటాదారులు పూర్తిస్థాయిలో స్పందిస్తే రూ. 1,438 కోట్లవరకూ మల్టిపుల్స్ ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. కాగా.. ఓపెన్ ఆఫర్ శుక్రవారం ముగింపు ధర రూ. 456తో పోలిస్తే 15 శాతం తక్కువకావడం గమనార్హం! గత ఏడాది కాలంలో కంపెనీ షేరు 2024 సెపె్టంబర్ 24న రూ. 590 వద్ద గరిష్టాన్ని తాకగా.. 2025 ఏప్రిల్ 7న రూ. 249 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. 2025 మార్చికల్లా ప్రమోటర్లు, ప్రమోటర్ సంస్థ 51.73 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
వాటా కొనుగోలుకి సెబీ, సీసీఐ అనుమతులు లభించవలసి ఉంది. ఈ లావాదేవీ తదుపరి కంపెనీ నియంత్రణ మల్టిపుల్స్ పీఈకి బదిలీ కానుంది. దిలీప్ పిరమల్, కుటుంబ సభ్యులు వాటాదారులుగా కొనసాగనున్నారు. దిలీప్ పిరమల్ కంపెనీకి చైర్మన్ ఎమిరిటస్‌గా వ్యవహరించనున్న ట్లు వీఐపీ ఇండస్ట్రీస్ పేర్కొంది. మల్టిపుల్స్ పీఈ ఫండ్స్‌తోపాటు.. సమ్విభాగ్ సెక్యూరిటీస్, మిథున్ పాదమ్ సాచేటి, సిద్ధార్థ సాచేటి, ప్రాఫిటెక్స్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ కన్సార్షియం వీఐపీ ఇండస్ట్రీస్‌ను సొంతం చేసుకోనుంది.
ఆహ్వానిస్తున్నాం..
కంపెనీలో వ్యూహాత్మక భాగస్వామికానున్న మల్టిపుల్స్ కన్సార్షియంకు ఆహ్వానం పలుకుతున్నట్లు వీఐపీ చైర్మన్ దిలీప్ పిరమల్ పేర్కొన్నారు. కంపెనీకున్న పటిష్ట బ్రాండ్ విలువ పునరుద్ధరణలో ఇది కీలక ముందడుగుగా వ్యాఖ్యానించారు. దీంతో ఇటీవల కొన్నేళ్లుగా సవాళ్లు ఎదుర్కొంటున్న కంపెనీ దేశీ లగేజీ మార్కెట్‌లో తిరిగి బలపడనున్నట్లు అభిప్రాయపడ్డారు. అత్యంత పటిష్ట కార్యకలాపాలు కలిగిన వీఐపీ యాజమాన్య మారి్పడిపై ఉద్వేగంగా ఉన్నట్లు మల్టిపుల్స్ ఆల్టర్నేట్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ వ్యవస్థాపకుడు, ఎండీ, సీఈవో రేణుకా రామ్‌నాథ్ వ్యాఖ్యానించారు. కంపెనీ బ్రాండు విలువను మరింత పెంచడంతోపాటు.. తదుపరి దశ వృద్ధికి కృషి చేయనున్నట్లు తెలియజేశారు.
వీఐపీ సంగతిదీ..
ముంబై కేంద్రంగా 1971లో ఏర్పాటైన వీఐపీ ఇండస్ట్రీస్ లగేజీ తయారీకి ప్రపంచంలోనే రెండో పెద్ద కంపెనీగా నిలు స్తోంది. ఆసియాలోకెల్లా అతి పెద్ద కంపెనీకాగా.. శామ్‌సోనైట్, సఫారీ ఇండస్ట్రీస్‌తో దేశీయంగా పోటీ పడుతోంది. వీఐపీ ఇండస్ట్రీస్ మార్కెట్ విలు వ రూ. 6,482 కోట్లుకాగా.. అరిస్ట్రోకాట్, వీఐపీ, కార్ల్‌టన్, స్కైబ్యాగ్స్, క్యాప్రీస్ బ్రాండ్లను కలిగి ఉంది. 2024కల్లా బ్రాండెడ్ లగేజీ మార్కెట్‌లో 50 శాతం మార్కెట్ వాటాను పొందింది. అయితే ప్రత్యర్థి కంపెనీలతో పోటీ పెరగడంతో మార్కెట్ వాటాను కోల్పోతూ వస్తోంది. గతేడాది (2024–25) వీఐపీ ఇండస్ట్రీస్ ఆదా యం రూ. 2,170 కోట్లకు చేరింది.
ఈ వార్తల నేపథ్యంలో వీఐపీ ఇండస్ట్రీస్ షేరు బీఎస్‌ఈలో 6 శాతం జంప్‌చేసి రూ. 482 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 487–431 మధ్య ఊగిసలాడింది.