
ఒక విడాకుల కేసులో తీర్పు ఇచ్చిన ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: వేరే పురుషునితో సహజీవనం చేస్తూ భర్త నుంచి భరణం పొందేందుకు ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు కొట్టివేసింది. మరో వ్యక్తితో ఆ మహిళ సహజీవనం చేస్తోందనే కారణంతో ఆమెకు భరణం హక్కు ఉండదని ఫ్యామిలీ కోర్టు స్పష్టం చేసింది. తన మాజీ భర్త చట్టపరంగా, నైతికంగానూ తనకు భరణం చెల్లించాల్సిన బాధ్యత ఉందని మహిళ వాదించినప్పటికీ కోర్టు ఆ వాదనలో పసలేదని తిరస్కరించింది.
గతంలో జరిగిన విచారణలోనూ డీఎన్‌ఏ పరీక్ష ఫలితాల ప్రకారం ఆమె పిల్లల్లో ఒకరికి మాజీ భర్త తండ్రి కాదని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె మరో వ్యక్తితో సహజీవనం చేస్తూ, అనేక ఆస్తుల నుంచి నిరంతరంగా ఆదాయం పొందుతున్న అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకుని తాజా పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంది. నేర శిక్షాస్మృతిలోని 125(4)సెక్షన్ ప్రకారం మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న భార్యకు భరణం పొందగోరే హక్కు ఉండదని ఫ్యామిలీ కోర్టు స్పష్టం చేసింది.
‘‘డీఎన్‌ఏ రిపోర్ట్‌తో పాటు విడాకుల తీర్పును ఈ మహిళ ఎప్పుడూ సవాలు చేయలేదు. అంటే ఆ నిర్ణయాలను ఆమె అంగీకరించినట్లే. ముఖ్యంగా భరణం అడిగిన మహిళ ఆర్థికంగా స్వతంత్రురాలు. అనేక ఆస్తుల నుంచి ఆదాయం పొందుతున్నారు. కనీసం పిల్లల పోషణ బాధ్యత కూడా ఈమెకు లేదు. భర్తే పిల్ల బాధ్యతలు, ఖర్చులు చూసుకుంటున్నారు. అత్త హత్య కేసులో నిందితురాలిగా నాలుగేళ్లపాటు ఈమె జైలులో ఉండి వచ్చారు. ఆమె తర్వాత నిర్దోషిగా విడుదలయ్యారు. ఆ కేసు ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో ఉంది. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, ఆమెకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని ప్రిసైడింగ్ ఆఫీసర్ నమ్రత అగర్వాల్ తన తీర్పులో పేర్కొన్నారు.