
సాధారణంగా మహిళలు వంట గది విశాలంగా ఉండాలని కోరుకుంటారు. కానీ, నేటి అవసరాలు, అభిరుచులు మారుతుండటంతో ఆధునిక వసతులనూ కోరుకుంటున్నారు. జిమ్, మెడిటేషన్ వంటి సౌకర్యాలతో పాటు వాకింగ్, జాగింగ్ ట్రాక్స్, గ్రీనరీ స్పేస్, పిల్లల కోసం పార్క్, స్పోర్ట్స్ వంటి వసతులను ఎంచుకుంటున్నారని ఆర్క్ గ్రూప్ సీఈఓ మేఘన గుమ్మి తెలిపారు. గృహిణి, ఉద్యోగిని ఎవరైనా సరే ఇంటిని, కుటుంబ సభ్యుల బాగోగులను చూసుకునేది మహిళే. దీంతో ఇంట్లో ఏ గదికి ఎంత స్పేస్ అవసరమో నిర్ణయించగలదు. వాస్తవానికి పురుషుల కంటే మహిళలకే దృశ్యీకరణ (విజువలైజేషన్) శక్తి ఎక్కువగా ఉంటుంది. తాను ఉండబోయే కిచెన్, బెడ్ రూమ్, బాల్కనీ ఇంట్లోని ప్రతీది ఏ విధంగా ఉండబోతుందో ఊహించగలదు.
–సాక్షి, సిటీబ్యూరో
ఐదారేళ్ల క్రితం వరకూ రియల్ ఎస్టేట్ రంగంలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండేది. అయితే స్థిరాస్తి రంగంలో వృత్తి నైపుణ్యం, ఆదాయ వనరులు పెరగడం, వర్క్ కల్చర్ మారడంతో క్రమంగా ఈ విభాగంలో మహిళలు ప్రవేశిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్, హెచ్‌ఆర్, మార్కెటింగ్, సేల్స్ విభాగంలోనే కాదు సైట్ల మీద కూడా మహిళలు పనిచేసే స్థాయికి ఎదిగారు. దీంతో రియల్టీ సెక్టార్ అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగంగా అభివృద్ధి చెందుతుంది. ఐటీ, ఫార్మా వంటి రంగాల్లో మాదిరిగా రియల్టీ సెగ్మెంట్‌లోనూ వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.
ఆమెకు నచ్చితేనే..
ఇల్లు కొందామని నిర్ణయించుకున్నాక.. ప్రాంతం, ధర, ప్రాజెక్ట్, వసతులు ఏవైనా సరే భర్తకు నచ్చినా సరే అంతిమంగా నిర్ణయించాల్సింది, ఓకే చేయాల్సిందీ ఇల్లాలే. ఆమెకు నచ్చకుండే ఇంటి కొనుగోలు చేయరు. సొంతింటి ఎంపికలో మహిళల పవర్ అదీ. అపార్ట్‌మెంట్లతో పోలిస్తే విల్లాలలో ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండటంతో నేటి యంగ్ ఉమెన్స్ విల్లాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు నిర్ణయాధికారం, కొనుగోలు శక్తి పెరగడంతోనూ ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడింది.
ఇన్‌ఫ్రాకు నీడ రియల్టీ..
మనల్ని అంటిపెట్టుకొని నీడ ఎలాగైతే ఫాలో అవుతుందో.. ఇన్‌ఫ్రాకు రియల్ ఎస్టేట్ కూడా అంతే. మౌలిక వసతులు అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలోనే రియల్ పరుగులు పెడుతుంది. భూముల ధరలు పెరగడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం సౌత్ హైదరాబాద్ వైపు ఫోకస్ పెట్టింది. కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం వంటి పశ్చిమ ప్రాంతాలు ఇప్పటికే కిక్కిరిసిపోయాయి. ఇక్కడ సామాన్యులు కొనే పరిస్థితి లేదు. సౌత్‌లో ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్‌తో కొత్తూరు, షాద్‌నగర్, ఆదిభట్ల, ముచ్చర్ల వంటి దక్షిణ ప్రాంతాలు బాగా డెవలప్ అవుతాయి.
ప్రస్తుతం ఆయా ప్రాంతాలలో ధరలు తక్కువగా ఉన్నాయి కాబట్టి సామాన్య, మధ్యతరగతి ఈ టైమ్‌లో కొనుగోలు చేయడం ఉత్తమం. ఏ నగరమైనా సమాంతరంగా అభివృద్ధి చెందాలి. కానీ, మౌలిక వసతుల కల్పనలో హెచ్చు తగ్గులు కారణంగా అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. దీంతో హైదరాబాద్‌లో వెస్ట్, సౌత్ జోన్‌లో భూముల ధరలు బాగా పెరిగాయి. మూసీ సుందరీకరణ, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ.. హైదరాబాద్ స్థిరాస్తి రంగాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లడం ఖాయం. ఈ బృహత్తర ప్రాజెక్ట్‌లతో రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ పుంజుకోవడం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment