ఆస్ట్రేలియా గోల్డెన్‌ వీసా రద్దు!

WithDraw Golden Visa Of Australia  - Sakshi

ఆస్ట్రేలియా ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా అక్కడి ప్రభుత్వ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే అందులో భాగంగా విదేశీయులు అక్కడ పెట్టుబడి పెట్టేందుకు వీలుగా, అక్కడే కొన్ని రోజులు నివసించేందుకు అనువుగా జారీచేస్తున్న ‘గోల్డెన్‌ వీసా ’లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ వీసా ప్రోగ్రామ్‌ ఆశించిన ఫలితాలను ఇవ్వట్లేదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఈ వీసాల స్థానంలో వృత్తి నిపుణులకు ఇచ్చే వీసాలను పెంచనున్నట్లు పేర్కొంది.

గోల్డెన్‌ వీసా నిబంధనల ప్రకారం కనీసం రూ.27 కోట్లు పెట్టుబడి పెట్టేవారు ఐదేళ్ల పాటు ఆస్ట్రేలియాలో ఉండొచ్చు. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం 2012లో ఈ నిబంధనను తీసుకొచ్చింది. హోంశాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు దాదాపు లక్ష మంది ఈ ప్రోగ్రామ్‌ కింద ఆసీస్‌లో ఉండేలా అవకాశం సంపాదించారు. ఇందులో 85శాతం చైనా మిలియనీర్లు ఉన్నారు.

ఇదీ చదవండి: ఎగిరిన కొత్త ఫ్లైట్‌.. దేశంలోనే తొలిసారి! 

కొంతకాలంగా ఈ ప్రోగ్రామ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీసా ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేసి కొందరు విదేశీయులు అక్రమ సంపదను తరలిస్తున్నారనే వాదనలున్నాయి. దీంతో వీటి జారీని రద్దు చేస్తున్నట్లు హోంమంత్రి క్లేర్‌ ఓ నీల్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. వీటి స్థానంలో వృత్తి నిపుణులకు మరిన్ని ఎక్కువ వీసాలు జారీ చేయడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించనుందని తెలిపారు. ఇప్పటికే కెనడా, బ్రిటన్‌, సింగపూర్‌ వంటి దేశాలు కూడా ఈ తరహా వీసా స్కీమ్‌లను రద్దు చేశాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top