చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు..ఇప్పుడే ఇలా ఉంటే, మరి రాబోయే రోజుల్లో ఎలా?

Will Gold Price Touch All-time High This Year - Sakshi

బంగారం, వెండి ఆభరణాలతో భారతీయులకు ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగినా, పండుగలు వచ్చినా బంగారం కొంటూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు పసిడి నగలు కొనేందుకు ఎగబడుతుంటారు. అయితే అలాంటి పసిడి ప్రియులకు బంగారం షాకిస్తూ దూసుకెళ్తుంది. బంగారం ధర ఇంతలా ఎందుకు దూసుకెళ్తుంది. గత ఆరు నెలల్లో విపరీతంగా పెరిగింది. వచ్చే 6 నెలల్లో ట్రెండ్‌ ఎలా ఉండబోతుంది. అసలు బంగారం ధర పెరగడానికి కారణం ఏంటి?

బంగారం, వెండి ధరలు లైఫ్‌ టైం హై స్థాయికి చేరువవుతున్నాయి. కరనా మహమ్మారి సమయంలో బంగారం, వెండి ధరలు రికార్డ్‌ స్థాయిలో పెరిగాయి. అప్పుడు మొదలైన పరుగు ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యలో కాస్త స్థిరంగా ఉన్నప్పటికీ గత 4, 5 నెలలుగా మళ్లీ దూసుకెళ్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో బంగారం ధరలు రూ.65 వేల (ప్రస్తుతం రూ.57,500)  మార్క్‌ దాటే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
బలీయమైన ఆర్థిక శక్తిగా చెలామణి అవుతున్న దేశాల్లో ఆర్ధిక మాంద్యం భయాలు, ద్రవ్యోల్బణంలో క్షీణత, ఇతర దేశాల్లో వడ్డీ రేట్ల పెంపులో తటస్థం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత, ఆర్ధిక మాంద్యంలో ప్రజలకు ఖర్చు చేసే శక్తి లేకపోవడం, దేశీయంగా డిమాండ్ పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణత కారణంగా బంగారం ధరలు పెరిగాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ కమోడిటీ రిసెర్చ్‌ హెడ్‌ హరీష్‌ వీ నాయర్‌ తెలిపారు. 

దేశీయంగా బంగారానికి మంచి డిమాండ్‌ ఉంది. అయితే కోవిడ్‌ సమయంలో కొనుగోలు దారులు బంగారం కొనుగోళ్ల నిర్ణయాన్ని విరమించుకున్నారు. కానీ మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో పసిడి విక్రయాలు గత ఆరు నెలలుగా జోరందుకున్నాయి. అదే సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడంతో భారత్‌లో బంగారం పెరుగుదలకు ప్రధాన కారణమైంది. రాబోయే రోజుల్లో బంగారంపై డిమాండ్‌ పెరిగే కొద్ది ధరలు సైతం అదే స్థాయిలో పెరగడాన్ని మనం గమనిస్తాం’ అని నాయర్‌ పేర్కొన్నారు. 

బంగారం ధరల్లో పెరుగుదల కొనసాగుతుందా?
ఏయేటి కాయేడు బంగారం విలువ రెట్టింపు అవుతూనే ఉంటుంది. గడించిన 10ఏళ్లల్లో బంగారం వ్యాల్యూ 88 శాతం పెరిగింది. రానున్న సంవత్సరాల్లో పసిడి పరుగులు లైఫ్‌ టైం హై స్థాయికి చేరుకుంటాయి. ఆర్థిక, ఇతర భౌగోళిక రాజకీయ అనిశ్చితుల మధ్య బంగారం ధరల విస్తృత ధోరణి సానుకూలంగా ఉందని నాయర్ చెప్పారు.

ఇక ద్రవ్యోల్బణంతో బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై తక్కువ ఆదాయం,ఈక్విటీల్లో అస్థిరతలతో ద్రవ్యల్బణం నుంచి కోలుకునేందుకు బంగారంపై పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ఇన్వెస్టర్ల వద్ద ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం.. రూ.56,296 కోట్ల విలువైన సావరీన్‌ గోల్డ్‌ బాండ్స్‌ ఉన్నాయి. అదే విధంగా రూ.21,455 కోట్ల విలువైన గోల్డ్‌ ఎక్ఛేంజ్‌- ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌) లో పెట్టుబడులు పెట్టినట్లు అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇండియా గణాంకాలు చెబుతున్నాయి. 

భారత్‌లో బంగారంపై డిమాండ్‌ ఎందుకు పెరుగుతుంది? 
వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ లెక్కల ప్రకారం భారత్‌లో ఉన్న మధ్య తరగతి కుటుంబాల్లో బంగారంపై డిమాండ్‌ 50 శాతంగా ఉంది. దానికి తోడు పాపులేషన్‌, గోల్డ్‌, గోల్డ్‌ జ్వువెలరీలు కీలక పాత్రపోషిస్తున్నాయి. ఇక 2009 తర్వాత గడిచిన పదేళ్ల కాలంలో అంటే 2021 వరకు బంగారం వినియోగంలో భారత్‌ చైనాను అధిగమించింది.

2021లో చైనా 673 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తే.. అదే ఏడాది భారత్‌ 611 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసి రెండో స్థానంలో నిలించింది. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు భారత్‌లో బంగారం విలువ ఎలా ఉందోననే వరల్డ్‌ గోల్డ్ కౌన్సిల్ ఇండియా సీఈవో పీఆర్‌ సోమసుందర్‌ అన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top