
న్యూఢిల్లీ: పసిడి ఒకే రోజు భారీగా నష్టపోయింది. చైనా దిగుమతులపై విధించిన టారిఫ్‌లను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు అమెరికా ప్రకటించడంతో సురక్షిత సాధనమైన బంగారంలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మరోవైపు భారత్–పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణపై అంగీకారం సైతం అమ్మకాలకు ఆజ్యం పోసింది. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.3,400 నష్టపోయి రూ.96,550కు దిగొచ్చింది.
ఇదీ చదవండి: భారత సైన్యం వేతన వివరాలు ఇలా..
యూఎస్–చైనా మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతి సంకేతాలు వెలువడడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంత చల్లబడడం బంగారం ధరల పతనానికి దారితీసినట్టు మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కళంత్రి తెలిపారు. వెండి కిలోకి రూ.200 నష్టపోయి రూ.99,700 స్థాయికి చేరింది. 2024 జూలై 23 తర్వాత ఒకే రోజు బంగారం ఎక్కువగా నష్టపోవడం ఇదే మొదటిసారి. చైనా ఉత్పత్తులపై 145% టారిఫ్‌లను 30%కి తగ్గించడానికి అమెరికా ఒప్పుకుంది. చైనా సైతం అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను 10%కి తగ్గించేందుకు ముందుకు వచ్చింది. రష్యా–ఉక్రెయిన్ మధ్య సంధి కుదరొచ్చన్న సంకేతాలతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చల్లబడినట్టు ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ సీనియర్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు.